Mehbooba Mufti: దేశ భద్రత పేరుతో నాకు పాస్ పోర్టును నిరాకరించారు: మెహబూబా ముఫ్తీ

  • సీఐడీ రిపోర్టు కారణంగా పాస్ పోర్టును నిరాకరించారు
  • సీఎంగా పని చేసిన వ్యక్తికి పాస్ పోర్టు ఇస్తే దేశానికి ముప్పు వాటిల్లుతుందా?
  • ఈడీ, సీబీఐ, ఎన్ఐఏలను దుర్వినియోగం చేస్తున్నారు
Government Denied Passport to Mehbooba Mufti

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఏడాదికి పైగా గృహ నిర్బంధంలో ఉన్నారు. మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆమెకు పాస్ పోర్టును పాస్ పోర్టు కార్యాలయం నిరాకరించింది. ఈ విషయాన్ని 61 ఏళ్ల ముఫ్తీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

'నాకు పాస్ పోర్టు ఇచ్చేందుకు పాస్ పోర్టు కార్యాలయం నిరాకరించింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే  అవకాశం ఉందంటూ సీఐడీ ఇచ్చిన రిపోర్టు కారణంగా పాస్ పోర్టు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. 2019 ఆగస్టు తర్వాత కశ్మీర్ లో నెలకొన్న సాధారణ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన వ్యక్తికి పాస్ పోర్టు ఉంటే దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందా?' అని ముఫ్తీ వ్యాఖ్యానించారు.

తన ట్వీట్ తో పాటు పాస్ పోర్టు అధికారులు పంపిన లేఖను కూడా ఆమె జతచేశారు. గత డిసెంబరులో పాస్ పోర్టు కోసం ఆమె దరఖాస్తు చేశారు. అయితే, పోలీసు విచారణలో కూడా ఆమెకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. 2019లో జమ్మూకశ్మీర్ ను రెండు యూటీలుగా మార్చిన తర్వాత... శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వందలాది మంది అక్కడి నేతలను భద్రతాబలగాలు నిర్బంధించాయి. గత అక్టోబర్ లో ఆమె విడుదలయ్యారు. అయితే, ప్రస్తుతం ఆమె మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు.

మరోవైపు పీడీపీ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. కక్షపూరిత చర్యల్లో భాగంగానే ముఫ్తీని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు ముఫ్తీ మాట్లాడుతూ... విపక్షాల గొంతుకను నొక్కేందుకు ఈడీ, సీబీఐ, ఎన్ఐఏలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News