అలాంటివారు ఈ నంబర్ కు వాట్సాప్ చేయండి.. అకౌంట్‌లో 10 వేలు వేస్తాం: అచ్చెన్నాయుడు

29-03-2021 Mon 13:48
  • పథకాలు రావని బెదిరించే వారి గురించి వాట్సాప్ చేయండి
  • తిరుపతి లోక్ సభ పరిధిలోని వారికి ఇది వర్తిస్తుంది
  • ఓటర్లంతా టీడీపీ పక్షాన నిలవాలి
Whatsapp to this number and get 10000 says Atchannaidu
వైసీపీకి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు రావంటూ వైసీపీ నేతలు ఎవరైనా  బెదిరింపులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తమ పార్టీ శ్రేణులకు సూచించారు.

వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల ఆగడాలను బయటపెట్టాలని అన్నారు. ఈ నంబర్ కు సమాచారాన్ని అందించాలంటూ 7557557744 వాట్సాప్ నంబర్ ను ప్రకటించారు. ఈ నంబర్ కు కాల్ రికార్డు కానీ, ఫొటో కానీ వాట్సాప్ చేస్తే... ఆ వ్యక్తుల అకౌంట్ లోకి రూ. 10 వేలు వేస్తామని చెప్పారు. తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందని అన్నారు.

పథకాలు పోతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు. అవి జగన్ రెడ్డి తండ్రి డబ్బులో, తాత డబ్బులో కాదని... అవి ప్రజల డబ్బులని అన్నారు. 10 పైసలు ఇచ్చి, 90 పైసలు దోచుకుంటున్న జగన్ కు బుద్ధి చెప్పాలంటే... తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లంతా టీడీపీ పక్షాన నిలవాలని కోరారు.