Virat Kohli: సామ్ కరణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచా?... 'షాక్' అన్న విరాట్ కోహ్లీ!

Kohli Shock After Sam Karan Selected for Man of the Match
  • నిన్న పూణె వేదికగా మూడో వన్డే
  • అద్భుతంగా ఆడిన సామ్ కరణ్
  • శార్దూల్ కు అవార్డు వస్తుందని భావించా
  • నిర్వాహకుల నిర్ణయం షాక్ కలిగించిందన్న కోహ్లీ
ఆదివారం నాడు పూణె వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డే అత్యంత ఉత్కంఠ భరితంగా జరుగగా, చివరి ఓవర్ మ్యాజిక్ లో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కరణ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఒంటిచేత్తో మ్యాచ్ ని మలుపుతిప్పి దాదాపు ఇంగ్లండ్ జట్టును విజయలక్ష్యాన్ని చేర్చిన కరణ్ కు ఈ గుర్తింపు లభించడంపై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు.

ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేస్తారని తాను భావించానని మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించిన కోహ్లీ, అందుకు భిన్నంగా సామ్ ను ఎంపిక చేయడంతో షాక్ నకు గురయ్యానని అన్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం కష్టమని వ్యాఖ్యానించాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అత్యధిక వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ ను ఎంపిక చేస్తారని భావించానని అన్నాడు. ఈ అవార్డు ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్ స్టోకు లభించింది.

వాస్తవానికి ఓటమి పాలైన జట్టులో ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో సచిన్, గంగూలీ వంటి వారికి ఇండియా ఓడిపోయిన తరువాత కూడా లభించింది. అయితే, నిన్నటి మ్యాచ్ లో జట్టు విజయానికి బాటలు వేసిన శార్దూల్ కు బదులుగా సామ్ కరణ్ ను అవార్డుకు ఎంపిక చేయడం కోహ్లీకి అసంతృప్తిని కలిగించింది. దాంతోనే అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఏది ఏమైనా నిన్నటి మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలైనా, తన అద్భుత పోరాట పటిమతో సామ్ కరణ్ అందరి మన్ననలనూ అందుకున్నాడు. సామ్ చూపిన ఆటతీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని, టాప్ ఆర్డర్ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చి, టెయిలెండర్ల వికెట్లను కాపాడుకుంటూ సెంచరీకి దగ్గర కావడం, జట్టును లక్ష్యానికి అడుగు దూరంలోకి చేర్చడం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది.
Virat Kohli
India
England
Cricket
Sam Karan

More Telugu News