Bangladesh: మోదీ పర్యటన ముగియగానే... బంగ్లాదేశ్ లో రెచ్చిపోయిన నిరసనకారులు!

TemplesAttacked after Modi Visit of Bangladesh
  • బంగ్లాదేశ్ లో రెండు రోజుల పాటు మోదీ పర్యటన
  • హిందూ దేవాలయాలపై దాడి
  • పోలీసుల కాల్పుల్లో పలువురికి గాయాలు
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన ఇస్లామిస్ట్ గ్రూప్ నిరసనకారులు రెచ్చిపోయారు. ఆదివారం నాడు తూర్పు బంగ్లాదేశ్ పరిధిలోని పలు దేవాలయాలపై దాడికి దిగారు. ఓ రైలును కూడా ధ్వంసం చేశారు. ఇటువంటి హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నిరసనలకు సంబంధించి ఇప్పటివరకూ 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీ దేశాన్ని వీడిన తరువాత నిరసనలు పెచ్చు మీరాయని తెలుస్తోంది.

బంగ్లాదేశ్ 50వ జాతీయోత్సవం సందర్భంగా మోదీ శుక్రవారం నాడు ఢాకాకు చేరుకుని, రెండు రోజుల పాటు పర్యటించి, శనివారం రాత్రి తిరిగి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. మోదీ పాలనలో ఇండియాలో ముస్లింలపై దాడులు పెరిగాయని ఆరోపిస్తున్న ఇస్లామిస్ట్ గ్రూపులు, ఈ నిరసనలకు దిగాయి. నిరసనకారులను చెదర గొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లను ప్రయోగించగా, పదుల సంఖ్యలో ప్రజలకు గాయాలు అయ్యాయి. వీధుల్లో ప్రదర్శనలకు దిగుతున్న వీరంతా, తమకు కనిపించిన దుకాణాలను నాశనం చేస్తున్నారు.

హిఫాజత్-ఏ-ఇస్లాం గ్రూప్ నిరసనకారులు ఇందుకు కారణమని పేర్కొన్న ఉన్నతాధికారులు, ఒక రైలు ఇంజన్ ను, అన్ని కోచ్ లనూ ధ్వంసంచేశారని, బ్రహ్మన్ బారియా జిల్లాలో దేవాలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకుని వచ్చి ఫర్నీచర్ ను నాశనం చేశారని, అక్కడి ప్రెస్ క్లబ్ పైనా దాడికి దిగి, క్లబ్ అధ్యక్షుడిని గాయపరిచారని తెలిపారు.

రాజ్ షాహీ జిల్లాలో బస్సులపై దాడులు జరిగాయని, అక్కడి నిరసనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారని, కొందరు పోలీసులకూ గాయాలు అయ్యాయని అన్నారు. కాగా, తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, పోలీసులు తుపాకులు వాడి తమవారిని హతమారుస్తున్నారని ఇస్లామిస్ట్ గ్రూప్ నేతలు ఆరోపిస్తున్నారు.
Bangladesh
Narendra Modi
Protests
Temples

More Telugu News