సచిన్ వాజే సమక్షంలో... ముంబై నదిలో గాలింపు.. హార్డ్ డిస్క్ స్వాధీనం!

29-03-2021 Mon 08:48
  • ముఖేష్ అంబానీ ఇంటివద్ద కారులో పేలుడు పదార్థాలు
  • మొత్తం వ్యవహారం సచిన్ వాజే చుట్టూ
  • నదిలో ల్యాప్ టాప్, వాహనం నంబర్ ప్లేట్లు కూడా లభ్యం
Hard Disk Recovered from Mumbai River with Presence of Sachin Vaze
ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద లభించిన కారులో పేలుడు పదార్థాలు ఉన్న కేసులో అరెస్ట్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే సమక్షంలో తూర్పు బాంద్రాలోని మిధీ నదిలో హార్డ్ డిస్క్ ను విచారణ అదికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హార్డ్ డిస్క్ ను నాశనం చేయాలని భావించిన సచిన్ వాజే, దానితో పాటు కారు నంబర్ ప్లేట్లను నదిలో విసిరివేసినట్టు అధికారులకు తెలుపగా, ఆయన్ను తీసుకుని వెళ్లి, ఎక్కడ పడేశాడో తెలుసుకుని, గజ ఈతగాళ్ల సాయంతో వాటిని వెలికి తీశారు. ఈ పరిణామంతో కేసు విచారణ తుది దశకు చేరుకున్నట్టేనని, మొత్తం కుట్ర సచిన్ వాజే నేతృత్వంలోనే జరిగిందనడానికి ఈ హార్డ్ డిస్క్ కీలకమని అధికారులు వ్యాఖ్యానించారు.

ఈ పేలుడు పదార్ధాల కేసులో తొలుత సచిన్ వాజేను అదుపులోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ), ఈ కేసును ప్రస్తుతం మరింత లోతుగా పరిశీలిస్తోంది. ఇదే సమయంలో మున్సుక్ హిరాన్ హత్య కేసును విచారిస్తున్న మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, సచిన్ వాజేను కీలక నిందితుడిగా భావిస్తోంది. మున్సుక్ కారునే దొంగిలించి, దానిలో పేలుడు పదార్థాలు పెట్టి, అంబానీ ఇంటి ముందు ఉంచిన సంగతి తెలిసిందే.

విచారణలో భాగంగా, ఆదివారం మధ్యాహ్నం నదిలోకి దిగిన డైవర్లు, ఓ ల్యాప్ టాప్ ను, సీపీయూను, 'ఎంహెచ్ 20 ఎఫ్పీ 1539' నంబర్ ప్లేట్ ను బయటకు తెచ్చారు. అంతకుముందు గురువారం నాడు ఎన్ఐఏ స్పెషల్ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సచిన్ వాజే ఇంట్లో, లెక్కచూపని 62 బులెట్లను కనుగొన్నామని పేర్కొన్నారు. సర్వీస్ రివాల్వర్ కోసం 30 బులెట్లను వాజేకు ఇచ్చారని, వాటిల్లో కేవలం 5 మాత్రమే రికవర్ అయ్యాయని, మిగతావి ఏమయ్యాయన్న లెక్క తెలియడం లేదని కూడా విచారణ అధికారులు పేర్కొన్నారు.