Ian Chappell: టీమిండియా జైత్రయాత్రపై ఆసీస్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు

  • కోహ్లీ సేన విదేశాల్లోనూ దూసుకుపోతోందన్న చాపెల్
  • ఆనవాయితీలను తిరగరాస్తోందని వ్యాఖ్యలు
  • జట్టులో ప్రతిభావంతులు ఎక్కువయ్యారని వెల్లడి
  • తుది జట్టులో స్థానం అంత ఈజీ కాదని వివరణ
Australia cricket legend Ian Chappell opines on Team India winning streak

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఇయాన్ చాపెల్ టీమిండియా విజయ ప్రస్థానంపై తన అభిప్రాయాలు వెల్లడించారు. విదేశాల్లో అనేక జట్లు పడుతూ లేస్తూ ప్రస్థానం సాగిస్తుంటే విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందంజ వేస్తోందని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఆనవాయితీలను తిరగరాస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ క్రికెట్ పై భారత్ ఆధిపత్యం చెలాయించే దిశగా సాగుతోందని అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు గంగూలీ ఏ జట్టుకు తలవంచరాదన్న ధోరణిని జట్టులో నింపాడని, ఎదుటి జట్టులోని ఆటగాళ్లకు తామేమీ తీసిపోమన్న నమ్మకం కలిగించాడని చాపెల్ వెల్లడించారు. అనంతరం ధోనీ వచ్చాక ఈ తరహా వైఖరి మరింత బలపడిందని, కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత అది పతాకస్థాయికి చేరిందని విశ్లేషించారు. భారత జట్టులో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఎక్కువయ్యారని, దాంతో తుదిజట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడిందని చాపెల్ పేర్కొన్నారు.

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా విజయవంతం కావడానికి భారత్ లో అమలు చేస్తున్న పటిష్టమైన దేశవాళీ క్రికెట్ కారణమని తెలిపారు. ఐపీఎల్, ఇతర దేశవాళీ టోర్నీలతో యువకులు సత్తా నిరూపించుకుంటున్నారని వివరించారు. కోహ్లీసేనతో ఆడేటప్పుడు సాదాసీదా వ్యూహాలతో ఆడదామంటే కుదరదన్న విషయాన్ని ఇతర జట్లు గ్రహిస్తున్నాయని చాపెల్ పేర్కొన్నారు. గతంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు ఎంతటి ఆధిపత్యాన్ని చూపాయో, ఇప్పుడు భారత్ అదే మార్గంలో పయనిస్తోందని వివరించారు.

More Telugu News