Kerala: ఆధునిక భావాలు కలిగిన కేరళలో బీజేపీ ఆటలు సాగవ్‌!: కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌

BJPs Tactics wont workout on Kerala says Shashi Tharoor
  • విద్వేషపూరిత రాజకీయాలు కేరళలో చెల్లుబాటు కావన్న కాంగ్రెస్‌ ఎంపీ
  • కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి విజయంపై ధీమా
  • శ్రీధరన్‌ కేరళలో బీజేపీ భవిష్యత్తుకు సమాధానం కాలేరని వెల్లడి
  • యూడీఎఫ్‌లో సీఎం అభ్యర్థి ప్రకటించకపోవడం అంశమేమీ కాదని వ్యాఖ్యలు 

కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం ఊపందుకుంది. ప్రధాన కూటములు ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌తో పాటు బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆధునిక భావాలు కలిగిన కేరళలో మతతత్వ పార్టీ అయిన బీజేపీ ఆటలు సాగవని మాజీ కేంద్ర మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ స్ఫష్టం చేశారు. ‘లవ్‌ జిహాద్‌’ వంటి లేనిపోని భయాలతో బీజేపీ చేసే విద్వేషపూరిత రాజకీయాలు కేరళలో చెల్లుబాటు కావని వ్యాఖ్యానించారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ సీఎం అభ్యర్థి అయిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌.. కేరళలో ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు ఏమాత్రం సమాధానం కాలేరని థరూర్‌ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తుండడంపై బీజేపీ చేసిన విమర్శలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. రాష్ట్రం వరకు ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ తలపడినప్పటికీ జాతీయ స్థాయిలో లౌకిక, ప్రజావ్యతిరేక విషయాల్లో ఒక్కటిగా పోరాడతామని చెప్పారు. గతంలో లోక్‌సభలో తాను లేవనెత్తిన అనేక విషయాల్లో సీపీఎం ఎంపీలు తనకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో విలక్షణతకు ఇది నిదర్శమన్నారు. అయినా వైవిధ్యాన్ని ఎప్పటికీ స్వాగతించని బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేయడం తనకు ఆశ్చర్యమనిపించలేదని థరూర్‌ అన్నారు.

సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా యూడీఎఫ్‌ ఎన్నికలకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదని థరూర్‌ అభిప్రాయపడ్డారు. అయినా పార్టీలో చాలా మంది అనుభవజ్ఞులైన నేతలు ఉన్నారని చెప్పారు. ఎల్‌డీఎఫ్‌ కూటమి వైఫ్యలాలు, అవినీతి, హింసపై పోరాడుతున్న తమకు ప్రజలు మద్దతుగా నిలుస్తారన్నారు. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిందని విమర్శించారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

  • Loading...

More Telugu News