Theenmar mallanna: పార్టీ పెడుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన తీన్మార్‌ మల్లన్న

  • పార్టీ పెట్టబోవడంలేదని వెల్లడి
  • నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలోనూ పోటీ చేయనని స్పష్టం
  • త్వరలో తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర
  • రాష్ట్రా, జిల్లా, మండల స్థాయిలో కమిటీలు
  • ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన మల్లన్న
theenmar mallanna made it clear that he is not going to float a party

త్వరలో జరగనున్న నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల్లో తాను పాల్గొనడం లేదని తీన్మార్‌ మల్లన్న స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం కాచవాని సింగారంలో జరిగిన సభలో ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. త్వరలో తెలంగాణవ్యాప్తంగా ఆరు వేల కి.మీ పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. ‘తీన్మార్‌ మల్లన్న టీం’ పేరుతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్న  నల్గొండ-వరంగల్‌-ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోటీలో ఆయన రెండోస్థానంలో నిలిచారు. గెలుపొందిన తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఆయనకు మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు నడిచింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్లన్నకు.. ప్రధాన రాజకీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

ఈ క్రమంలో ఆయన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆయన చేసిన ప్రకటనతో వాటికి తెరపడినట్టయింది. అయితే ఆయన ఏ ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేస్తున్నాడన్నదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

More Telugu News