Indian Army: పాంగోంగ్​ సరస్సు వద్ద సైనికుల డ్యాన్స్​.. వీడియో వైరల్​

  • ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి రిజిజు
  • ఆర్మీని పొగడ్తల్లో ముంచెత్తిన నెటిజన్లు
  • అదే అసలైన ఆనందమంటే అంటూ కామెంట్లు
Indian Army jawans dance at the Pangong Tso lake in viral video

చొరబాటుదారులు, పొరుగు దేశాల సైనికుల ఆక్రమణల నుంచి దేశాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే సైనికులు.. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. వారు కష్టపడుతున్నా జనాన్ని అనుక్షణం రక్షిస్తుంటారు. సెలవుల్లేకుండా నిత్యం గస్తీ కాస్తుంటారు. అలాంటి అలసి సొలసిన మనసులు ఎంజాయ్ మెంట్ కు దాదాపు దూరం. కానీ, సైనికులూ అప్పుడప్పుడూ తమ కష్టాలను మరిచిపోతూ మనోల్లాసం పొందుతూ ఉంటారు. ఇదిగో ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది.

ఇటీవల లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు వద్ద ఎంత ఉద్రిక్త పరిస్థితులున్నాయో తెలిసిందే. చైనా కయ్యానికి కాలు దువ్వింది. ఈ మధ్యనే ఆ ఘర్షణ వాతావరణం కాస్త తగ్గింది. మళ్లీ చైనా ఎటు నుంచి వస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో కొందరు సైనికులు అక్కడే పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి సైనికులు మనోల్లాసం పొందుతూ డ్యాన్స్ చేశారు. భారత సైన్యంలోని గూర్ఖా జవాన్లు అలసట నుంచి ఇలా సేదతీరారు.

ఈ వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘సైనికులు ఇలా ఎంజాయ్ చేసినప్పుడల్లా గొప్పగా అనిపిస్తుంటుంది. పాంగోంగ్ సో వద్ద గూర్ఖా జవాన్లు ఇలా డ్యాన్స్ చేసి సేదతీరారు’’ అంటూ కామెంట్ పెట్టారు. ఆ వీడియో వైరల్ అయింది. నెటిజన్లు సైనికులను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇదీ అసలైన ఆనందమంటే అంటూ కామెంట్లు పెట్టారు. రియల్ హీరోలు డ్యాన్స్ చేస్తుంటే చూడముచ్చటగా ఉందని పేర్కొంటూ వీడియోకు లైకులు కొట్టారు.

More Telugu News