Corona Virus: కరోనా కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళికను ప్రకటించిన కేంద్రం!

  • వైరస్ సోకితే ఐసోలేషన్ తప్పనిసరి
  • కాంటాక్ట్ ట్రేసింగ్ పైనా దృష్టి
  • అందరూ నిబంధనలు పాటించాల్సిందే
  • వెల్లడించిన ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్
Indias 5 Step Plan to Tackle Corona

ఇండియాలో కరోనా కేసులు మరోమారు విజృంభిస్తుండటంతో, నష్ట నివారణకు కేంద్రం కీలక చర్యలు తీసుకోనుంది. కేసులు అధికంగా ఉన్న మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమైన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఈ దిశగా 5సూత్రాల ప్రణాళికలను ప్రకటించారు. కరోనా కట్టడికి నమూనాల పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఆయన సూచించారు.

ఇదే సమయంలో వైరస్ సోకిన వారిని ఐసోలేషన్ లో తప్పనిసరిగా ఉంచాలని, ఆపై వారి కాంటాక్ట్ ట్రేసింగ్, ఆరోగ్య కార్యకర్తల రక్షణ, ప్రజలు నిబంధనలను తు.చ. తప్పక పాటించేలా చూడటం తప్పనిసరని, అప్పుడే కేసుల సంఖ్య మరింత పెరగకుండా చూడవచ్చని ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇండియాలో 46 జిల్లాల్లో కరోనా అత్యధికంగా ఉందని, ఈ జిల్లాల్లో కంటెయిన్ మెంట్ జోన్లను కొనసాగించాలని ఆయా ప్రాంతాల స్థానిక అధికారులకు సూచించామని అన్నారు.

ఈ 46 జిల్లాల్లోనే కొత్తగా వస్తున్న కరోనా కేసుల్లో 71 శాతం వరకూ ఉంటున్నాయని, వీటిల్లో 30కి పైగా జిల్లాలు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. కరోనా టెస్టుల్లో 70 శాతం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు మాత్రమే ఉండేలా చూడాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామని వ్యాఖ్యానించిన ఆయన, కరోనా వచ్చిన వారికి దగ్గరగా మెలిగిన వారిని మూడు రోజుల ఐసొలేషన్ లో ఉంచి పరీక్షించాలని కూడా ఆదేశించినట్టు పేర్కొన్నారు.

More Telugu News