Pakistan: పాక్ పై రుణాల వెల్లువ... బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించిన వరల్డ్ బ్యాంకు

  • కరోనాతో కుదేలైన పాక్
  • 68 ఏళ్లలో ఎన్నడూలేనంత ఆర్థిక సంక్షోభం
  • ఇప్పటికే 500 మిలియన్ డాలర్ల రుణం ప్రకటించిన ఐఎంఎఫ్
  • తాజాగా 1.336 బిలియన్ డాలర్ల రుణానికి వరల్డ్ బ్యాంక్ సమ్మతి
World Bank agreed to deliver billion dollars loan for Pakistan

గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ అత్యధికంగా అంతర్జాతీయ రుణాలపైనే ఆధారపడుతోంది. సౌదీ అరేబియా నుంచి భారీగా రుణాలు స్వీకరిస్తున్న పాక్ పై తాజాగా అంతర్జాతీయ సంస్థలు రుణాలు గుమ్మరిస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ఇటీవలే 500 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా, ప్రపంచ బ్యాంకు ఏకంగా 1.336 బిలియన్ డాలర్లను పాక్ కు ఇచ్చేందుకు మొగ్గుచూపింది. ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. పాక్ ప్రభుత్వం తరఫున ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నూర్ అహ్మద్ ఈ భారీ రుణ ఒప్పందంపై సంతకాలు చేశారు.

సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం, సామాజిక భద్రత, విపత్తుల నిర్వహణ, వాతావరణ వైపరీత్యాల సహాయక చర్యలకు, వ్యవసాయం, ఆహార భద్రత, మౌలిక సదుపాయాలకు, ఈ నిధులను వినియోగించనున్నారు. కరోనా కారణంగా పాక్ గత 68 ఏళ్లలో ఎన్నడూలేనంత ఆర్థిక సంక్షోభం బారినపడింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థకు తాజా రుణాలు కొద్దిమేర ఉపశమనం కలిగిస్తాయని పాక్ ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు.

More Telugu News