శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వెంకటేశ్ ప్రాజక్ట్?

27-03-2021 Sat 18:06
  • క్లాస్ టచ్ తో సినిమాలు రూపొందించే శేఖర్ 
  • శేఖర్ చెప్పిన కథకు వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్
  • వచ్చే ఏడాది సెట్స్ కి వెళ్లే అవకాశం  
Shekhar Kammula to direct Venkatesh
మన దర్శకులలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. కొంతమంది మాస్ ని ఆకట్టుకునే సినిమాలు తీస్తే.. మరికొందరు క్లాస్ ఆడియన్స్ ని అలరించే సినిమాలు తీస్తుంటారు. అయితే, క్లాస్ టచ్ తో సినిమాలు రూపొందిస్తూ, విజయాలు సాధించే దర్శకులు తక్కువగా వుంటారు. అలాంటి వారిలో ఇప్పటి దర్శకులలో ముందు భాగాన నిలిచేది శేఖర్ కమ్ముల. 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీడేస్'.. ఈ చిత్రాలన్నీ శేఖర్ కు దర్శకుడిగా ఓ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి.

ఇప్పుడీయన స్టార్ హీరో వెంకటేశ్ తో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల వెంకటేశ్ కి శేఖర్ ఓ కథ చెప్పాడనీ, అది వెంకీకి బాగా నచ్చిందని అంటున్నారు. దీంతో ఈ ప్రాజక్ట్ సెట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయిపల్లవి జంటతో శేఖర్ 'లవ్ స్టోరీ' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది త్వరలో విడుదల కానుంది. దీని తర్వాత వెంకటేశ్ సినిమా స్క్రిప్టుపై శేఖర్ వర్క్ చేస్తాడని అంటున్నారు.

ఇక వెంకటేశ్ 'నారప్ప' చిత్రాన్ని పూర్తిచేసి ప్రస్తుతం 'ఎఫ్ 3', 'దృశ్యం 2' చిత్రాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగులు కూడా ఆయా షెడ్యూల్స్ ప్రకారం జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక వచ్చే ఏడాది శేఖర్ దర్శకత్వంలో వెంకీ చిత్రాన్ని చేస్తారని సమాచారం.