ఆంధ్రా యూనివర్సిటీలో 65 మందికి కరోనా పాజిటివ్... అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఆళ్ల నాని

27-03-2021 Sat 16:11
  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • పెరుగుతున్న కొత్త కేసులు
  • ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో కరోనా కలకలం
  • 1,500 కరోనా టెస్టులు నిర్వహించిన జిల్లా వైద్యశాఖ
Students tested positive in Andhra University engineering college
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. తాజాగా విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. వర్సిటీకి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలో 65 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంపస్ లో జిల్లా వైద్య వర్గాలు 1,500 కరోనా టెస్టులు నిర్వహించాయి. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు తరలించారు. దీనిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించారు. జిల్లా ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణను అడిగి ఏయూలో కరోనా వ్యాప్తి వివరాలు తెలుసుకున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో నిత్యం 7 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... పాడేరు, అరకు, కేజీహెచ్, అనకాపల్లి, నర్సీపట్నం, విమ్స్ ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామని, 1000 బెడ్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు.

కాగా, విద్యార్థులకు కరోనా సోకిన నేపథ్యంలో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ లోని పలు కాలేజీలు తమ విద్యార్థులకు ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని నిర్ణయించాయి. ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏయూ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, ఏయూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా, ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విభాగాలు ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ బోధనకు మారాలని వర్సిటీ రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.