DK Aruna: జగన్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారా?: కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్

  • కాళ్లు అడ్డంపెట్టి ఏపీ అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఆపుతానని అన్నారు
  • పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కడుతుంటే సోయి లేకుండా ఉన్నారు
  • హరీశ్ భయంతోనే పాత సచివాలయాన్ని కూల్చేశారు
DK Aruna criticises KCR for not responding on AP Projects

ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ్యారు. జూరాల వద్ద కాలు అడ్డంపెట్టి ఏపీ అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఆపుతానని గతంలో కేసీఆర్ అన్నారని... ఇప్పుడు దాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారా? అని మండిపడ్డారు. ఆర్డీఎస్ కుడి కాలువతో పాటు, ఇతర ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపడుతుంటే... కేసీఆర్ సోయి లేకుండా ఉన్నారని దుయ్యబట్టారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్ కు లేదని అరుణ అన్నారు. పాత సచివాలయం వాస్తు వెన్నుపోటుకు అనుకూలంగా ఉందంటూ, మేనల్లుడు హరీశ్ రావు భయంతో దాన్ని కూల్చేశారని విమర్శించారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్ రావుపై అరుణ మండిపడ్డారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయకూడదనే ఇంగితం కూడా హరీశ్ కు లేదని అన్నారు.

కేంద్ర జలశక్తి శాఖకు బండి సంజయ్ రాసిన లేఖలో ఏముందో తెలిస్తే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుల డీపీఆర్ లను సమర్పిస్తే మీరు ఎంత నీతిమంతులో అర్థమవుతుందని అన్నారు. మీ అడ్డగోలు అవినీతి బయటపడుతుందని... జనాలు మిమ్మల్ని పేడతో కొడతారని చెప్పారు. అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించిన హరీశ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ నేతలు కటకటాలను లెక్కించే సమయం ఎంతో దూరంలో లేదని అన్నారు.

More Telugu News