కరోనా పెరుగుతుంటే... ఫ్రంట్ లైన్ వారియర్స్ ను విధుల నుంచి తొలగిస్తారా?: పట్టాభి

27-03-2021 Sat 12:14
  • వేలాది మంది ఫ్రంట్ లైన్ వారియర్లను విధుల నుంచి తొలగించారు
  • సెకండ్ వేవ్ సమయంలో వారు విధుల్లో లేకపోతే చాలా కష్టం
  • ఎవరి ప్రాణం పోయినా జగన్ బాధ్యత వహించాలి
Pattabhi fires on Jagan for removing front line warriors from duties

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత పట్టాభి మండిపడ్డారు. కరోనా విధుల్లో ఉన్న వేలాది మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ను విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసులు పెరిగితే... బాధితులకు చికిత్స ఎవరు అందిస్తారని ప్రశ్నించారు. వేలాది మంది విధుల్లో లేకపోతే ఆసుపత్రుల్లో పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని... వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి జగన్ కారణమయ్యారని పట్టాభి అన్నారు. రానున్న రోజుల్లో కరోనా విస్తరించినా... ఎవరి ప్రాణాలు పోయినా దానికి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్లకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లించి... వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. వారికి నెలల తరబడి జీతాలు ఇవ్వకపోగా... విధుల నుంచి తొలగించారని చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందని పట్టాభి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఫ్రంట్ లైన్ వారియర్లకు పూలాభిషేకం చేశారని... మన రాష్ట్రంలో మాత్రం వారికి జీతాలు కూడా ఇవ్వకుండా తొలగించారని దుయ్యబట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరులో శాంతియుతంగా నిరసనలు చేస్తున్న కోవిడ్ వారియర్స్ పై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దారుణమని అన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే... రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.