West Bengal: పశ్చిమ బెంగాల్, అసోంలలో కొనసాగుతున్న తొలి దశ పోలింగ్.. తరలివస్తున్న ఓటర్లు

  • కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతున్న పోలింగ్
  • పశ్చిమ బెంగాల్‌లో 30, అసోంలో 47 స్థానాలకు పోలింగ్
  • ఎన్నికల నేపథ్యంలో ప్రధాని ట్వీట్
West Bengal Assam Election 2021 First Phase Elections Begin

పటిష్ఠ భద్రత మధ్య పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలి విడత ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.

 పశ్చిమ బెంగాల్‌లో తొలి దశలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 191 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 73 లక్షల మందికిపైగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివాసీలు ఎక్కువగా నివసించే పురూలియా, బంకురా, ఝూర్‌గ్రాం, తూర్పు మేదినీపూర్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది.

అసోంలోని 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 264 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ మొత్తం 11,537 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు జరుగుతున్న 47 స్థానాలకు గాను 39 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అసోం గణ పరిషత్ 10 స్థానాల్లో బరిలోకి దిగింది. కాంగ్రెస్ సారథ్యంలోని మహాజోత్ (గ్రాండ్ అలయెన్స్) 43 స్థానాల్లో పోటీ చేస్తోంది.

తొలి దశ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లు అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా యువ నేస్తాలు ఓటింగులో పాల్గొనాలని కోరారు.

More Telugu News