చోరీ కేసులో ఏపీ ఇంజినీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

26-03-2021 Fri 19:46
  • ఢిల్లీలో చోరీ కేసులో ఇరుక్కున్న వైజాగ్ యువకుడు
  • అద్దెకు గది కావాలని వచ్చి దొంగతనం
  • ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని
  • రూ.1.40 లక్షల విలువైన కెమెరా, నగదు అపహరణ
Delhi police arrests AP student in a theft case

ఏపీకి చెందిన ఓ విద్యార్థి దేశ రాజధాని ఢిల్లీలో చోరీ కేసులో చిక్కుకున్నాడు. వైజాగ్ కు చెందిన కోనేరు అన్వేష్ బీటెక్ చదువుతున్నాడు. అయితే అతడు రూ.1.40 లక్షల విలువైన కెమెరాతో పాటు, పెద్దమొత్తంలో డబ్బును తస్కరించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీకి చెందిన చంద్రప్రకాశ్ మహేశ్వరి అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా అన్వేష్ ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 2న ఈ ఫిర్యాదు దాఖలైంది.

తన నివాసంలో ఓ గది అద్దెకు కావాలని అన్వేష్ వచ్చాడని, ఆపై చోరీకి పాల్పడ్డాడని చంద్రప్రకాశ్ మహేశ్వరి ఆరోపించాడు. కెమెరా, నగదు పోయాయని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అన్వేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కెమెరా స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన నగదులో రూ.22 వేలు ఖర్చు చేసినట్టు గుర్తించారు. పోలీసులు విచారించగా.... తాను పాత కార్లు కొనేందుకు ఢిల్లీ వచ్చానని, ఇక్కడ తక్కువ ధరలకు కొనుగోలు చేసి, ఏపీలో లాభాలకు అమ్ముకోవాలని తన ప్రణాళిక అని అన్వేష్ వివరించాడు.