Supreme Court: సైరస్​ మిస్త్రీని తొలగించడం సరైనదే: సుప్రీంకోర్టు

Supreme Court upholds Tata Sons decision to sack Cyrus Mistry as chairman
  • టాటా సన్స్ నిర్ణయానికి సమర్థన
  • అది అణచివేత కానే కాదని కామెంట్
  • సుప్రీం తీర్పుపై రతన్ టాటా హర్షం
  • విలువలు పాటిస్తామనడానికి తీర్పే నిదర్శనమని వ్యాఖ్య

టాటాలకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలిగిస్తూ టాటా సన్స్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. 2016 అక్టోబర్ లో మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన్ను మళ్లీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమిస్తూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్ క్లాట్) ఆదేశాలు జారీ చేసింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టాటా సన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇటు సైరస్ మిస్త్రీ కూడా మరో పిటిషన్ వేశారు.

ఆ రెండు పిటిషన్లను శుక్రవారం విచారించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. సైరస్ మిస్త్రీని చైర్మన్ గా తొలగిస్తూ టాటా సన్స్ తీసుకున్న నిర్ణయం సరైనేదనని వ్యాఖ్యానిస్తూ తీర్పునిచ్చింది. మిస్త్రీపై బోర్డు తీసుకున్న చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ మొత్తంలో షేర్లున్న వారిని అణచివేయడం కానేకాదని వ్యాఖ్యానించింది.

అయితే, టాటా సన్స్ లో తమ షేర్లకు మంచి పరిహారం ఇప్పించేలా చూడాలన్న షాపూర్ జీ పల్లోంజీ పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. టాటాసన్స్ ఈక్విటీ వాల్యుయేషన్ పైనే షాపూర్ జీ పల్లోంజీ గ్రూప్ షేర్ల విలువ ఆధారపడి ఉంటుందని, అలాంటప్పుడు ఏది మంచి పరిహారమవుతుందో తామెలా చెప్పగలమని వ్యాఖ్యానించింది. దాని గురించి టాటా సన్స్ తోనే తేల్చుకోవాలని సూచించింది.

కోర్టు తీర్పుపై రతన్ టాటా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఇది గెలుపోటముల సమస్య కాదు. నా సమగ్రతపై, సంస్థ నైతిక విలువలపై ఎన్నెన్నో దాడులు జరిగాయి. కానీ, ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో అవన్నీ పటాపంచలయ్యాయి. టాటా సన్స్ ఎప్పుడూ విలువలను పాటిస్తుందని చెప్పడానికి సుప్రీం కోర్టు తీర్పే నిదర్శనం. మన న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పు న్యాయాన్ని, నిజాయితీని మరింత పటిష్ఠం చేస్తుంది’’ అని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News