Civil Aviation: కరోనా నిబంధనలు పాటించని విమాన ప్రయాణికులకు కేంద్రం వార్నింగ్​!

  • విమానం ఎక్కనివ్వబోమన్న విమానయాన మంత్రి
  • నిషేధిత జాబితాలో పెడతామని హెచ్చరిక
  • ఇప్పటికే డీజీసీఏకి ఆదేశాలు ఇచ్చామని వెల్లడి
  • ఉడాన్ పథకం గొప్ప సక్సెస్ అని కామెంట్
Passengers To Be Put On No Fly List For Violating Covid Norms says Aviation Min

కరోనా నిబంధనలను పాటించని ప్రయాణికులపై నిషేధం విధిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు ఇచ్చామని, వాటిని పాటించని  ప్రయాణికులను ‘నో ఫ్లై’ జాబితాలో పెట్టాల్సిందిగా విమానాశ్రయాల ప్రాధికార సంస్థకు ఇప్పటికే ఆదేశాలు పంపించామని ఆయన చెప్పారు.

నిబంధనలను పాటిస్తే కరోనాపై విజయం సాధించవచ్చని, కానీ, కొందరి నిర్లక్ష్యం కారణంగానే సమస్యలు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని ఆదేశించామన్నారు. పదే పదే చెప్పినా పట్టించుకోని ప్రయాణికులను.. మళ్లీ విమానం ఎక్కకుండా నిషేధిత ప్రయాణికుల జాబితాలో పెడతామని హెచ్చరించారు.

బస్సులు, రైళ్లలో ప్రయాణం కన్నా విమానాల్లో ప్రయాణం సురక్షితమైనదని చాలా మంది అనుకుంటున్నారన్నారు. ఉడాన్ (సామాన్యుడినీ విమానం ఎక్కిద్దాం/ఉడె దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకం ద్వారా చాలా ప్రాంతాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయని, విమాన చార్జీలూ అందుబాటు ధరలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ఉడాన్ పథకం గొప్ప విజయం సాధించిందన్నారు. దేశంలో మరో వంద విమానాశ్రయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 300 రూట్లలో విమానాలు నడుస్తున్నాయని, వాటిని వెయ్యికి పెంచుతామని తెలిపారు.

More Telugu News