28వ తేదీ సాయంత్రం 6 నుంచి తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్!

26-03-2021 Fri 10:02
  • హోలీ సందర్భంగా ఆంక్షలు
  • 30వ తేదీ ఉదయం 6 గంటల వరకూ నిషేధం
  • నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవన్న పోలీసులు
Wines Shops Bundh in View of Holy
హోలీ పండగ సందర్భంగా 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకూ మద్యం షాపులను మూసివేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

రిజిస్టర్డ్ క్లబ్ లు, స్టార్ హోటళ్లకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, రహదారులపై బహిరంగంగా హోలీ వేడుకలు చేసుకోవడం, పబ్లిక్ ప్లేసుల్లో రంగులు చల్లుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు ఇప్పటికే పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది.

హోలీ రోజున ద్విచక్ర వాహనాలపై వేగంగా వెళుతూ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా, ఇతరులకు ఇబ్బందులు కలిగించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరించారు. నిబంధనలను మీరిన వారిపై కేసులను నమోదు చేస్తామని అన్నారు. హోలీ పండగను ప్రశాంతంగా ఇళ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.