Corona Virus: కరోనా రెండో వేవ్ తో వృద్ధి రేటు తగ్గదు: ఆర్బీఐ గవర్నర్

  • మహమ్మారిని ఎదుర్కొనేందుకు కావాల్సినంత అనుభవం
  • గత సంవత్సరంతో పోలిస్తే మారిన పరిస్థితులు
  • 10.5 శాతం వృద్ధి ఖాయమన్న శక్తికాంత దాస్
No Impact on Growth Rate says RBI

ఇండియాలో ఇప్పుడు కరోనా టీకాలు శరవేగంగా ఇస్తున్నారని, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు కావాల్సినంత అనుభవం కూడా ఉందని, ఈ నేపథ్యంలో కరోనా రెండో వేస్ కొనసాగుతున్నా, దీని ప్రభావం వృద్ధి రేటుపై కనిపించబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. టైమ్స్ నెట్ వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్ క్లేవ్ లో ప్రసంగించిన ఆయన, గత సంవత్సరం మార్చి, ఏప్రిల్ లో ఉన్న పరిస్థితులతో పోలిస్తే, ఇండియా వద్ద ఇప్పుడు ఎన్నో అస్త్రాలున్నాయని అన్నారు.

కరోనాను ఎలా నియంత్రించవచ్చో ప్రభుత్వాలకు, ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, ఈ కారణంగానే రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 10.5 శాతం వరకూ ఉంటుందని గతంలో వేసిన అంచనాలనే ప్రస్తుతమూ కొనసాగిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇండియాలో అమలు చేస్తున్న యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ సిస్టమ్) విశ్వవ్యాప్తం కానున్నాయని ఈ సమావేశంలో దాస్ అభిప్రాయపడ్డారు.

యూపీఐ విధానం మిగతా చెల్లింపు వ్యవస్థలతో పోలిస్తే చౌకైనదని గుర్తు చేసిన ఆయన, ఆర్టీజీఎస్ ద్వారా వివిధ రకాల దేశాల కరెన్సీలను బట్వాడా చేసుకోవచ్చని అన్నారు.  ఆర్థిక సంస్కరణలను ప్రస్తావించిన ఆయన, ఎన్బీఎఫ్సీ డివిడెండ్ పంపిణీపై విధి విధానాలను ఖరారు చేయనున్నామని పేర్కొన్నారు. ఆర్థికరంగంలో స్థిరత్వం, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ భద్రత తదితర అంశాలకు ఏ మాత్రం విఘాతం కలుగకుండా ఈ విధానం ఉంటుందని స్పష్టం చేశారు.

More Telugu News