Bangalore: బెంగళూరు వెళ్లాలనుకుంటున్నారా... అయితే కొవిడ్‌ నెగెటివ్ ధ్రువపత్రం తప్పనిసరి

  • కొత్త కేసులు విజృంభిస్తున్నందునే కొత్త నిబంధన
  • ఆంక్షల్ని కఠినతరం చేసిన కర్ణాటక
  • ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి
  • రద్దీ ఉండే ప్రాంతాల్లో మార్షల్స్‌ ఏర్పాటుకు యోచన
Covid negative certificate is mandatory for thse who travel to bangalore

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు నగరానికి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ- పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ వెల్లడించారు. ఈ నిబంధన కేవలం బెంగళూరు నగరానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని సుధాకర్‌ తెలిపారు. బెంగళూరు నగరంలో నమోదవుతున్న కొవిడ్‌ కేసుల్లో 60 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల ప్రయాణికులే ఉన్నారని తెలిపారు. బుధవారం ఒక్కరోజే బెంగళూరులో 1400 కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో గురువారం ఉదయం మంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, చండీగఢ్‌ల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.

బస్‌ స్టేషన్లు, మార్కెట్లు, థియేటర్లు, కల్యాణ మండపాలు, కన్వెన్షన్‌ హాళ్లు, పాఠశాలలు, కళాశాలల క్యాంపస్‌ల వద్ద భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలు అమలయ్యేలా మార్షల్స్‌ను పెడతామని సుధాకర్‌ తెలిపారు.

More Telugu News