Corona Virus: ఏప్రిల్‌ ద్వితీయార్ధంలో గరిష్ఠ స్థాయికి కరోనా కేసులు... ఎస్‌బీఐ నివేదిక

Secind wave has been started caes will reach peaks in april second half
  • రెండో వేవ్‌ ప్రారంభమైందని స్పష్టం
  • మార్చి 23 నాటికే 25 లక్షల కొత్త కేసులు
  • నెమ్మదించిన ఆర్థిక కార్యకలాపాలు
  • వ్యాక్సినేషన్‌ వేగవంతం చేస్తేనే నియంత్రణ
  • దేశంలో కరోనా పరిస్థితిపై ఎస్‌బీఐ నివేదిక
దేశంలో కరోనా విజృంభణ తీరును బట్టి చూస్తే రెండో వేవ్‌ ప్రారంభమైందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నివేదిక తెలిపింది. ఫిబ్రవరి 15 మొదలుకొని వంద రోజుల పాటు రెండో వేవ్‌ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏప్రిల్ ద్వితీయార్ధంలో రోజువారీ కేసులు గ‌రిష్ఠ‌స్థాయికి చేరతాయని తెలిపింది.

కేసులు పెరుగుతున్న తీరును బట్టి చూస్తే మార్చి 23 నాటికే దేశవ్యాప్తంగా రెండో వేవ్‌లో 25 లక్షల కొత్త కేసులు ఉండి ఉంటాయని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. క్షేత్రస్థాయిలో కరోనా నిబంధనలు, ఆంక్షల్ని తేలిగ్గా తీసుకోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని తెలిపింది.

కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో గత వారం రోజులుగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయని నివేదిక తెలిపింది. ఇక ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న లాక్‌డౌన్‌లు, ఆంక్షల ప్రభావం వచ్చే నెలలో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపింది.

కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని నివేదిక సూచించింది. ప్రస్తుతం రాష్ట్రాలు సగటున 34 లక్షల మందికి టీకా అందిస్తున్నాయని తెలిపింది. దీన్ని 40-45 లక్షలకు పెంచాలని సూచించింది.

ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంట‌ల వ్యవధిలో దేశ‌వ్యాప్తంగా 53,476 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గ‌తేడాది న‌వంబ‌ర్ ఆరో తేదీ త‌ర్వాత అత్య‌ధికంగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. మ‌హారాష్ట్ర‌, పంజాబ్ రాష్ట్రాల్లో మ‌హ‌మ్మారి ప్ర‌భావంతో ప్ర‌జ‌లు దారుణ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు.
Corona Virus
SBI
Corona vaccine

More Telugu News