Manish Sisodia: కేజ్రీవాల్‌ను అడ్డుకోవాలనే ఆ బిల్లును తీసుకొచ్చారు... ప్రధాని మోదీపై సిసోడియా ఆరోపణలు

Modi wants to stop kejriwal
  • మోదీకి ప్రత్యామ్నాయం కేజ్రీవాలే అని చర్చ
  • అందుకే బీజేపీ అభద్రతాభావానికి లోనవుతోందని వ్యాఖ్య
  • ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనే బిల్లుకు పార్లమెంటు ఆమోదం
  • మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఆప్‌ నేత
దేశ రాజధాని నగరం ఢిల్లీని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎలాగైనా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఆరోపించారు.

అందులో భాగంగానే లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు విస్తృత అధికారాలు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ పనితీరుతో అభద్రతా భావానికి గురవుతోందన్న విషయం ఈ బిల్లుతో స్పష్టమైందన్నారు.

మోదీని ఎదుర్కోగలిగే వ్యక్తి ఒక్క కేజ్రీవాలే  అనే చర్చ దేశవ్యాప్తంగా ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. అందుకే కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ‘ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు -2021(జీఎన్‌సీటీడీ)’ను తీసుకొచ్చారన్నారు.

మోదీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారని సిసోడియా ఆరోపించారు. ఈ బిల్లుపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. తమకు ఉన్న అవకాశాలను అన్వేషిస్తున్నామన్నారు. ‘ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌’ అని స్పష్టం చేస్తూ తీసుకొచ్చిన జీఎన్‌సీటీడీ బిల్లుకు విపక్షాల నిరసనల మధ్య బుధవారం రాజ్యసభలో కూడా ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
Manish Sisodia
Arvind Kejriwal
Narendra Modi
New Delhi

More Telugu News