Supreme Court: భారత ఆర్మీలో లింగవివక్షపై సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు!

  • సమాజ నిర్మాణం మగవారితో సృష్టించబడినదిగా ఉంది
  • ఆర్మీ కమిషన్ ప్రతి ఒక్కరికీ సమానమే
  • కీలక రూలింగ్ ఇచ్చిన అత్యున్నత ధర్మాసనం
Supreem Court Comments on Women Army

సైన్యంలో శాశ్వత ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన ఆదేశాలు ఇవ్వాలంటూ, దాదాపు 80 మంది మహిళా అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలకు వైద్యపరమైన ఫిట్‌నెస్ అవసరం అని సైన్యాధికారులు చెప్పడం ఏకపక్షమని, సహేతుకమైనది కాదని ఈ ఉదయం వ్యాఖ్యానించింది.

ఈ కేసులో తుది తీర్పును వెలువరించిన అత్యున్నత ధర్మాసనం "మన సమాజం యొక్క నిర్మాణం మగవారి కోసం, మగవారి ద్వారా సృష్టించబడిందని అందరమూ ఇక్కడ గుర్తించాలి" అని వ్యాఖ్యానించడం గమనార్హం.

సైన్యం యొక్క సెలెక్టివ్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఎసిఆర్) మూల్యాంకనం మహిళలపై వివక్ష చూపుతోందని అభిప్రాయపడుతూ, దీని అమలు సహేతుకం కాదని పేర్కొంది. ఇదే అమలైతే ఎస్ఎస్సీ (షార్ట్ సర్వీస్ కమిషన్)  ద్వారా విధుల్లోకి రాబడిన మహిళా అధికారులకు వ్యతిరేకమేనని జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

పిటిషన్ దాఖలు చేసిన మహిళా సైనిక ఉద్యోగుల్లో పలువురు అనేక అవార్డులు గెలుచుకున్నారని, వీరిలో చాలామంది విదేశీ ఎసైన్ మెంట్లపై చక్కగా పనిచేసి విజయాలు సాధించారని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 2020 ఫిబ్రవరిలోనే సైన్యంలోని మహిళా అధికారులను పురుష అధికారులతో సమానంగా కమాండ్ స్థానాలకు అర్హత పొందటానికి అనుమతి ఇచ్చామని గుర్తు చేస్తూ, దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన వాదనలు వివక్షతో పాటు, కలతపెట్టేవిగా ఉన్నాయని, శాశ్వత కమిషన్ అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

More Telugu News