Jagan: నాలుగు వారాల్లో కోటి మందికి కరోనా టీకా: వైఎస్ జగన్

  • వారంలో నాలుగు రోజుల పాటు టీకాల పంపిణీ
  • రోజుకు రెండు గ్రామాల్లో ఇవ్వాలి
  • అధికారులను ఆదేశించిన వైఎస్ జగన్
One Crore Vaccines in 4 Weeks says Jagan

కరోనా మహమ్మారిని సమూలంగా నియంత్రించే దిశగా ఆరోగ్య యజ్ఞం ప్రారంభించాలని, ఇందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో కోటి మందికి వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక, మునిసిపల్ ఎన్నికలు ముగియడం, పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని నేపథ్యంలో, సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేపట్టాలని జగన్ సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో మండల పరిధిలో వారంలో నాలుగు రోజుల పాటు, రోజుకు రెండు గ్రామాల్లో వ్యాక్సిన్ లను వేయాలని, తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి, లోపాలను గుర్తించి సరిదిద్దిన తరువాత విస్తృత స్థాయిలో టీకాలను ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని జగన్ ఆదేశించారు. వాస్తవానికి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్ పై పూర్తి దృష్టిని సారించి వుండేవాళ్లమని వ్యాఖ్యానించిన జగన్, అది జరిగే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

తిరిగి ఎప్పుడు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్న సంగతి తెలియడం లేదని, ఈ నేపథ్యంలోనే టీకాలు ఇచ్చే ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించిన జగన్, దీనికి బాధ్యులు ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. ఏదిఏమైనా వ్యాక్సినేషన్ ను ఉద్ధృతం చేయాలని, ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని అధికారులకు జగన్ సూచించారు.

More Telugu News