Kethireddy Venkatrami Reddy: ఛలో ధర్మవరంకు పిలుపునిచ్చిన దళిత సంఘాలు.. వైసీపీ ఎమ్మెల్యే ఇంటివద్ద భారీ భద్రత!

  • అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుని దూషించిన కేతిరెడ్డి
  • కేతిరెడ్డిపై మండిపడుతున్న దళిత సంఘాలు
  • ఛలో ధర్మవరం పిలుపుతో తీవ్ర ఉద్రిక్తత
Dharmavaram YSRCP MLA Kethireddy faces heat from Dalits

అనంతపురం జిల్లా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇబ్బందుల్లో పడ్డారు. దళిత సామాజికవర్గానికి చెందిన అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇలాంటి పనికిమాలిన కలెక్టర్ ను తాను ఇంతవరకు చూడలేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలను చాలా హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలో కలెక్టర్ ను పరుషపదజాలంతో దూషించారు. ఈ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ముఖ్యంగా కేతిరెడ్డిపై దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. వైసీపీ మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా కేతిరెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. దళితులను కించపరిచేలా మాట్లాడితే సొంత పార్టీ ఎమ్మెల్యే అని కూడా చూడమని ఆమె హెచ్చరించారు.

మరోవైపు దళిత సంఘాలు ఈరోజు ఛలో ధర్మవరానికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో, ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. ధర్మవరంలోని కేతిరెడ్డి నివాసం చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కేతిరెడ్డి నివాసం వైపు అన్ని రహదారుల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

More Telugu News