Vijayashanti: కేసీఆర్ ఏం చేసినా అరకొరగానే ఉంటుంది: విజయశాంతి

Vijayashanti Fires on KCR Govt
  • కరోనా నివారణకు ఏం చర్యలు తీసుకున్నారు?
  • తప్పులను ఎత్తి చూపుతున్న ప్రజలు
  • అధికారులు అన్ని విషయాల్లో విఫలమన్న విజయశాంతి
కరోనా కట్టడి దిశగా తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం అరకొర చర్యలు మాత్రమే తీసుకుంటోందని బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి నిప్పులు చెరిగారు. ఈ మేరకు కేసీఆర్ తీరును విమర్శిస్తూ, తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ ను పెట్టారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, విద్యార్థుల పేరు చెప్పి విద్యా సంస్థలను మూసి వేశారని, అయితే, మిగతా ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని నిలిపివేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

"తెలంగాణ సర్కారు ఏ పని చేసినా అరకొరగానే ఉంటుందనడానికి రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్ని చూస్తే అర్థమవుతుంది. విద్యార్థుల్లో కరోనా వ్యాపిస్తున్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. కానీ, మిగిలిన చోట్ల కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారన్నది గమనిస్తే శూన్యం.

 సూర్యాపేటలో నిన్న అనేకమంది గాయాలపాలైన కబడ్డీ పోటీల నిర్వహణ తీరు చూస్తే ప్రధానంగా రెండు తప్పులను అందరూ ఎత్తి చూపుతున్నారు. ఇక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ తీసుకోలేదు సరి కదా... గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

ఈ ఒక్క చోటే కాదు, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కోవిడ్ కట్టడికి తగిన చర్యలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి పరిస్థితి అదుపు తప్పకుండా చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పరిస్థితుల్ని చూసైనా తెలంగాణ సర్కారు మేలుకోకుండా ఈ పాలకుల పాపాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోంది" అని విజయశాంతి విమర్శలు గుప్పించారు.
Vijayashanti
KCR
Telangana
Corona Virus

More Telugu News