India: తొలి వన్డేలో టీమిండియా ఘనవిజయం... సిరీస్ లో ముందంజ

  • భారత్-ఇంగ్లండ్ మధ్య పూణేలో మొదటి వన్డే
  • 66 పరుగుల తేడాతో భారత్ జయభేరి
  • 318 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ 251 ఆలౌట్
  • బెయిర్ స్టో 94 పరుగులు
  • ప్రసిద్ధ్ కృష్ణకు 4 వికెట్లు
India defeats England in Pune

ఇప్పటికే ఇంగ్లండ్ పై టెస్టు, టీ20 సిరీస్ లను చేజిక్కించుకుని మాంచి ఊపుమీదున్న టీమిండియా వన్డే సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. పూణేలో నేడు ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో 66 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత్ విసిరిన 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 251 పరుగులకే ఆలౌటైంది.

కొత్త బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరవగా, శార్దూల్ ఠాకూర్ మరోసారి కీలక సమయాల్లో వికెట్లు తీసి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. అటు, స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా తన వంతుగా 2 వికెట్లు తీసి భారత్ విజయంలో పాలుపంచుకున్నాడు. కృనాల్ పాండ్యకు ఓ వికెట్ దక్కింది.

ఛేజింగ్ లో ఇంగ్లండ్ కు లభించిన ఆరంభం చూస్తే ఈ మ్యాచ్ పై భారత్ ఆశలు వదులుకోవాల్సిందే అని అందరూ భావించారు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 66 బంతుల్లో 7 సిక్సులు, 6 ఫోర్లతో 94 పరుగులు చేయగా, జాసన్ రాయ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 46 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ తొలి వికెట్ కు 14.2 ఓవర్లలోనే 135 పరుగులు జోడించారు.

ఈ దశలో ఇంగ్లండ్ పరిస్థితిపై ఎవరికీ సందేహాలు లేవు. కానీ కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతరీతిలో పుంజుకుని ఇంగ్లండ్ ను కట్టడి చేశాడు. అతడికి శార్దూల్ ఠాకూర్ కూడా తోడవడంతో ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. ఇయాన్ మోర్గాన్ (22), మొయిన్ అలీ (30) భారత బౌలింగ్ దాడులను ఎదురొడ్డి నిలిచే ప్రయత్నం చేసినా అది కాసేపే అయింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 317 పరుగులు చేసింది. ధావన్ 98, రాహుల్ 62 నాటౌట్, కృనాల్ పాండ్య 58 నాటౌట్, కోహ్లీ 56 పరుగులు చేశారు. ఈ విజయంతో 3 వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో ముందంజ వేసింది. రెండో వన్డే పూణేలోనే మార్చి 26న జరగనుంది.

More Telugu News