Chhattisgarh: మావోయిస్టుల దాడిలో ఐదుగురు పోలీసుల మృతి

  • ఛత్తీస్‌గఢ్‌, నారాయణపూర్‌ జిల్లాలో ఘటన
  • సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకున్నమావోలు
  • మరో 14 మందికి తీవ్ర గాయాలు
  • కూంబింగ్‌ నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఘటన
four police killed in maoists attack

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘోర దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లా రిజర్వు గార్డ్స్‌ (డీఆర్‌జీ) సిబ్బంది వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడ్డారు. నారాయణపూర్‌ జిల్లాలో 27మంది సిబ్బందితో వెళ్తున్న బస్సును లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మృతిచెందగా.. 14 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నారాయణపూర్‌ జిల్లాలో కడేనార్‌, కన్హరగావ్‌ల మధ్య వెళ్తున్న ఈ బస్సును లక్ష్యంగా చేసుకొని ఐఈడీ పేల్చడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్థీ మాట్లాడుతూ.. కూంబింగ్ నిర్వహించిన అనంతరం తిరిగివస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

More Telugu News