మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల విలీనం.. కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు

23-03-2021 Tue 19:16
  • ఏపీలో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భావం
  • మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం నోటిఫికేషన్ జారీ
  • ఉత్తర్వులిచ్చిన మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి
  • రెండు మున్సిపాలిటీల కలయికతో భారీ కార్పొరేషన్ ఏర్పాటు
New municipal corporation emerges after Tadepalli and Mangalagiri municipalities merge
రాష్ట్రంలో కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఆవిర్భవించింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలను కలిపేసి కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏపీ మున్సిపల్ యాక్ట్ 1994 ప్రకారం ఏపీ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం మంగళగిరి మున్సిపాలిటీ, దాని పరిధిలోని 11 గ్రామ పంచాయతీలు... తాడేపల్లి మున్సిపాలిటీ, దాని పరిధిలోని 10 గ్రామ పంచాయతీలు కూడా కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పేరిట కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఏపీ పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, సీఎం జగన్ కార్యాలయం ఇప్పటివరకు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక తాడేపల్లితో పాటు, మంగళగిరి మున్సిపాలిటీలను ఆదర్శ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేశారు. తద్వారా తాడేపల్లి మున్సిపల్ పరిధి మరింత పెరిగింది. ఇప్పుడు మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల కలయికతో విస్తృతమైన కార్పొరేషన్ రూపుదిద్దుకుంది.