Team India: విజృంభించిన టీమిండియా... ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం

Team India posts huge total in Pune
  • పూణేలో భారత్-ఇంగ్లండ్ తొలి వన్డే
  • టాస్ గెలిచిన ఇంగ్లండ్
  • భారత్ కు మొదట బ్యాటింగ్
  • 98 పరుగులు చేసిన ధావన్
  • కోహ్లీ అర్ధసెంచరీ
  • చివర్లో ఉతికారేసిన రాహుల్, కృనాల్
ఇంగ్లండ్ తో తొలి వన్డేలో భారత ఆటగాళ్లు వీర విహారం చేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ మొదలుకుని, కెరీర్ లో మొదటి వన్డే ఆడుతున్న కృనాల్ పాండ్య వరకు బ్యాట్లు ఝుళిపించారు. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 106 బంతుల్లో 98 పరుగులు చేయడం మ్యాచ్ లో హైలైట్. అయితే రెండు పరుగుల తేడాతో ధావన్ సెంచరీ చేజారింది. ధావన్ స్కోరులో 11 ఫోర్లు, 2 సిక్సులున్నాయి.

మరో ఓపెనర్ రోహిత్ శర్మ 28 పరుగులు సాధించాడు. కెప్టెన్ కోహ్లీ 56 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేయగా... చివర్లో కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్య విజృంభించారు. రాహుల్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేయగా, కృనాల్ కేవలం 31 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ అజేయంగా నిలిచారు. రాహుల్, కృనాల్ ధాటికి ఇంగ్లండ్ బౌలర్లు చివరి 5 ఓవర్లలో ఏకంగా 67 పరుగులు సమర్పించుకున్నారు.

ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 3 వికెట్లు, మార్క్ ఉడ్ 2 వికెట్లు తీశారు. శ్రేయాస్ అయ్యర్ 6 పరుగులు, హార్దిక్ పాండ్య 1 పరుగు చేసి అవుటయ్యారు. పూణే ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
Team India
England
ODI
Pune
Virat Kohli
Sikhar Dhawan
KL Rahul
Krunal Pandya

More Telugu News