BJP: మత మార్పిడులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం.. తమిళనాడు మేనిఫెస్టోలో బీజేపీ హామీ

  • మేనిఫెస్టోను విడుదల చేసిన నితిన్ గడ్కరీ  
  • గోవులను వధించడంపై నిషేధం
  • ఆగమ శాస్త్రాల అధ్యయనం కోసం యూనివర్శిటీ ఏర్పాటు
BJP gives top priority for Hindu in its manifesto

దక్షిణాదిన కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం పాగా వేయాలనే పట్టుదలతో బీజేపీ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ద్రవిడ సంస్కృతికి గుండెగా భావించే తమిళనాడులో పాదం మోపాలని భావిస్తోంది. అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల బరిలోకి దిగిన కమలనాథులు... ఇక్కడ కూడా మతం కార్డునే బయటకు తీశారు.

తమ మేనిఫెస్టోలో ఈ అంశాలకే పెద్ద పీట వేశారు. మత మార్పిడి నిరోధక చట్టం, మత మార్పిడికి పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు, గోవులను వధించడంపై నిషేధం వంటి అంశాలను తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ చేర్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిన్న చెన్నైలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్.మురుగన్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలతో సంప్రదించి మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు. బీజేపీ మత స్వేచ్ఛను కోరుకుంటుందని... అయితే, మత స్వేచ్ఛ అంటే బలవంతంగా మత మార్పిడులకు పాల్పడటం కాదని అన్నారు. అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.

గోవధను నిషేధించడాన్ని మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా పేర్కొన్నారు. కేరళకు ఆవులను రవాణా చేయడంపై నిషేధం విధిస్తామని తెలిపారు. వాస్తవానికి 2002లో జయలలిత సీఎంగా ఉన్నప్పుడే తమిళనాడులో ఇవన్నీ అమల్లోకి వచ్చాయి. మత మార్పిడులు, దేవాలయాలలో జంతువులు, పక్షులను బలి ఇవ్వడం వంటి వాటిని జయ ప్రభుత్వం నిషేధించింది. అయితే, ఆ తర్వాత కరుణానిధి (డీఎంకే) సీఎం అయిన తర్వాత ఆ రెండు చట్టాలను తీసేశారు.

ఆసక్తికర విషయం ఏమిటంటే... 2011లో జయ మరోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ఆ చట్టాల జోలికి వెళ్లలేదు. వాటిని మళ్లీ అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు బీజేపీ మరోసారి ఆ అంశాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.

బీజేపీ మేనిఫెస్టో కమిటీ హెడ్ హెచ్.రాజా మాట్లాడుతూ... సెక్యులర్ ప్రభుత్వం పేరుతో ఇన్నేళ్లుగా హిందూ ఆలయాలను నియంత్రిస్తూ వచ్చారని... ఈ వ్యవస్థను తాము మారుస్తామని చెప్పారు. ఆగమ శాస్త్రాల అధ్యయనం కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

More Telugu News