హాస్ట‌ల్ ప‌క్క‌నే బీటెక్ విద్యార్థిని మృత‌దేహం ల‌భ్యం

23-03-2021 Tue 12:26
  • మేడ్చల్‌ జిల్లా మైసమ్మగూడ స‌మీపంలో ఘ‌ట‌న‌
  • మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చ‌దువుతోన్న విద్యార్థిని
  • కృపా ప్రైవేటు హాస్ట‌ల్లో ఉంటోన్న అమ్మాయి
  • భవనం పైనుంచి దూకి ఆత్మహత్య?  
btech student commits suicide
ఓ హాస్ట‌ల్ ప‌క్క‌నే బీటెక్ విద్యార్థిని మృత‌దేహం ల‌భ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మేడ్చల్‌ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతోన్న చంద్రిక అనే విద్యార్థిని కళాశాల సమీపంలోని కృపా ప్రైవేటు వసతి గృహంలో ఉంటోంది. ఈ రోజు ఉద‌యం ఆ హాస్ట‌ల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో చంద్రిక మృతదేహం క‌న‌ప‌డ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

హాస్ట‌ల్ ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించిన పోలీసులు ఆ విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. చంద్రిక స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ అని గుర్తించారు. ఆమె గ‌త నెల  4న హాస్ట‌ల్‌లో చేరింద‌ని, ఫైన‌ల్ ఇయ‌ర్ పరీక్షల కోసం చ‌దువుకుంటోంద‌ని పోలీసులు చెప్పారు. ఆమె మృతికి గ‌ల‌ వివరాలు తెలియరాలేదని అన్నారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.