మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

23-03-2021 Tue 09:35
  • మృతులలో 12 మంది మహిళలు  
  • వేగంగా వెళ్తూ బస్సును ఢీకొన్న ఆటో
  • మృతులు అంగన్‌వాడీ కేంద్రంలో వంట మనుషులు
13 killed as bus and auto rickshaw collide in Gwalior
మధ్యప్రదేశ్‌లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 12 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

గ్వాలియర్‌లో ఓ ఆటో వేగంగా వెళ్తూ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితులు అంగన్‌వాడీ కేంద్రంలో వంటలు చేసేవారని పేర్కొన్నారు. ఘటనా స్థలంలోనే 8 మంది మహిళలు, ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, మిగిలినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.