Supreme Court: మద్యం అతిగా తాగి మరణిస్తే బీమా వర్తించదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

No insurance claim if death due to alcohol consumption says SC
  • 1997లో అతిగా మద్యం తాగి మరణించిన అటవీశాఖ ఉద్యోగి
  • వర్షాలు, చలి వల్లే మరణించాడంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు
  • పోస్టుమార్టంలో బయటపడిన నిజం
  • జాతీయ వినియోగదారుల ఫోరం తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం
అతిగా మద్యం తాగి చనిపోతే బీమా చెల్లించాల్సిన అవసరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టమైన తీర్పు చెప్పింది. సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న వ్యక్తి 1997లో మరణించాడు.

అతిగా వర్షాలు కురవడం, విపరీతమైన చలి కారణంగానే అతడు మరణించాడని అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, అతడు అతిగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పోస్టుమార్టంలో తేలింది. అతడు ప్రమాదంలో మరణించలేదు కాబట్టి పరిహారం చెల్లించేందుకు బీమా సంస్థ నిరాకరించింది.

దీంతో బాధిత కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో బీమా కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించింది. విచారించిన ఫోరం బీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, అటవీ సంస్థ మాత్రం పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ తీర్పును అటవీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

విచారించిన జస్టిస్ ఎంఎం శాంతన్ గౌండర్, జస్టిస్ వినిత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Supreme Court
Alcohol
Death
Insurance

More Telugu News