ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, రిలయన్స్ ఒప్పందం కేసులో అమెజాన్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

22-03-2021 Mon 14:35
  • రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య ఒప్పందం
  • ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు
  • సింగపూర్ ఆర్బిట్రేషన్ ఆదేశాలకు వ్యతిరేకమంటున్న అమెజాన్
  • ఒప్పందం అంశంలో ముందుకెళ్లొద్దన్న ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్
  • ప్యూచర్ గ్రూప్ కు ఆదేశాలు
  • డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన ఫ్యూచర్ గ్రూప్
Delhi High Court issues orders to Amazon
రిలయన్స్ తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లొద్దంటూ ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ను ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ రూ.24,713 కోట్లు కాగా, ఈ ఒప్పందాన్ని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యతిరేకిస్తోంది. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేటర్ ఆదేశాలను ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించిందని అభిప్రాయపడింది. దాంతో ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ ను  ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.

వాదోపవాదాలు విన్న మీదట సింగిల్ బెంచ్ ఇచ్చిన ఒప్పందం నిలుపుదల ఆదేశాలపై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ లతో కూడిన బెంచ్ స్టే ఇచ్చింది. ఈ ఒప్పందం పట్ల అభ్యంతరాలేంటో చెప్పాలని అమెజాన్ కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.

అంతేకాదు, ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తదితరుల ఆస్తులను అటాచ్ చేయాలన్న ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలపైనా ధర్మాసనం స్టే ఇచ్చింది. వారిని ఏప్రిల్ 28న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.