Mumbai: అంబానీ ఇంటివద్ద దొరికిన పేలుడు పదార్ధాలు అంత తీవ్రమైనవి ఏం కాదు.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ వెల్లడి

  • జిలెటిక్‌ స్టిక్స్‌ స్వల్ప పేలుడు  తీవ్రత కలిగినవే
  • అమ్మోనియం నైట్రేట్‌ వినియోగం
  • రెండు రోజుల్లో ఎన్‌ఐఏకు నివేదిక
  • హిరేన్‌ మృతి, వాహనంపైనా కొనసాగుతున్న దర్యాప్తు
Eplosives found at ambani house were not that dangerous

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిపి ఉంచిన కేసులో మరో విషయం బయటపడింది. కారులో లభించిన జిలెటిన్ స్టిక్స్‌ పెద్ద పేలుడుకు దారితీసే సామర్థ్యం ఉన్నవి కాదని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తెలిపింది. వాటితో స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడే సంభవిస్తుందని పేర్కొంది. ఈ జిలెటిన్ స్టిక్స్‌లో అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్టు గుర్తించారు. అమ్మోనియం నైట్రేట్‌కు సహజంగానే మండే స్వభావం ఉంటుంది. దీని మోతాదు స్టిక్స్‌లో తక్కువగా ఉన్నట్టు ఫోరెన్సిక్ బృందం వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో బావులు తవ్వడానికి, రోడ్ల నిర్మాణానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారని పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఈ నివేదికను జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేస్తామని ఓ అధికారి తెలిపారు.

అలాగే వాహనం యజమాని ఎవరు, దీని రిజిస్టర్డ్‌ నెంబర్ మార్చారా అన్న విషయాలపై కూడా తాము దర్యాప్తు చేస్తున్నామని అధికారి తెలిపారు. వాహనంలో ఏవైనా రక్తపు మరకలు, వెంట్రుకల వంటి ఆనవాళ్ల కోసం వెతుకుతున్నామని వెల్లడించారు. డ్రైవింగ్‌ ఎవరు చేసి ఉంటారనే అంశాన్ని కూడా విచారిస్తున్నామని తెలిపారు. వీటన్నింటి ద్వారా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఈ వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరేన్ మృతదేహం థానేలోని ఓ కాలువలో కనుగొన్న విషయం తెలిసిందే. అయితే, అతనికి ఎవరైనా డ్రగ్స్‌ ఇచ్చారా అన్న కోణంలోనూ ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని హిరేన్ భార్య విమల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన హత్య అని ఆమె ఆరోపించారు. కాగా, ఈ కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను  ఎన్ఐఏ అధికారులు నిరంతరాయంగా విచారిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం అంబానీ ఇంటి వద్దకు తీసుకువెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

More Telugu News