Team India: ఆఖరి టీ20లో ఇంగ్లండ్ బౌలింగ్ ను చీల్చిచెండాడిన భారత బ్యాట్స్ మెన్

Team India batsmen smashes England bowling attack series decider
  • అహ్మదాబాద్ లో ఐదో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసిన భారత్
  • కోహ్లీ 80 నాటౌట్
  • రోహిత్ శర్మ 64 పరుగులు
  • భారీ షాట్లతో విరుచుకుపడిన భారత టాపార్డర్
ఇంగ్లండ్ తో సిరీస్ ఫలితం తేల్చే చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ చెలరేగారు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు తమను బాగా ఇబ్బందిపెట్టిన ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశారు. రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య అందరూ వీరావేశంతో బ్యాటింగ్ చేయగా.... ఆర్చర్, మార్క్ ఉడ్ సహా ఇంగ్లండ్ బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. మొత్తమ్మీద భారత్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీ ఓపెనర్లుగా బరిలో దిగారు. ఈ జోడీ ఆరంభం నుంచే బ్యాట్లు ఝుళిపించడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. రోహిత్ శర్మ 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 64 పరుగులు చేయగా... చివరివరకు క్రీజులో ఉన్న కోహ్లీ 52 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 7 ఫోర్లు, 2 సిక్సులున్నాయి.

ఇక చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ మరోసారి విరుచుకుపడ్డాడు. సూర్యకుమార్ 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేయగా... చివర్లో హార్దిక్ పాండ్య 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు నమోదు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

కాగా 225 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసక ఓపెనర్ జాసన్ రాయ్ పరుగులేమీ చేయకుండా తొలి ఓవర్లోనే వెనుదిరిగాడు. భువనేశ్వర్ బౌలింగ్ లో ఇన్నింగ్స్ రెండో బంతికే రాయ్ బౌల్డయ్యాడు.
Team India
England
T20
Ahmedabad

More Telugu News