హైదరాబాదు పార్కుల్లో సంగీత కచేరీలు... అలసిన మనసులకు ఉపశమనం!

20-03-2021 Sat 16:21
  • కరోనా కారణంగా పార్కుల్లో తగ్గిన సందడి
  • ప్రజల్లో సంగీతం ధైర్యం నింపుతుందంటున్న తత్త్వ ఆర్ట్స్
  • ప్రజల్లో ఉత్తేజం కోసం శాస్త్రీయ సంగీత కచేరీలు
  • ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సంగీతమే ఔషధం
Music concerts in Hyderabad parks

సంగీతం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించే మహత్తర కళారూపం. మానసిక ఒత్తిళ్లను తొలగించడంలో సంగీతం పాత్ర ఎనలేనిదని అందరూ అంగీకరిస్తారు. అందుకే ఇకపై హైదరాబాదులోని పార్కుల్లో శాస్త్రీయ సంగీతం వినిపించనున్నారు. ఈ కార్యాచరణకు రూపకర్త తత్త్వ ఆర్ట్స్ అనే సంస్థ. కరోనా కారణంగా పార్కులకు వచ్చి సేద దీరేందుకు ప్రజలు వెనుకాడుతున్న నేపథ్యంలో.... ప్రజల్లో ధైర్యం నింపడంతో పాటు, సంగీతం సాయంతో వారిలో మానసిక ఉత్తేజం కలిగించడానికి తత్త్వ ఆర్ట్స్ హైదరాబాదులోని పార్కుల్లో సంగీత కచేరీలు ప్రారంభించింది.

పార్కుల్లో  శాస్త్రీయ సంగీతకారులు హృద్యమైన రాగాలను ఆలపిస్తుంటే... ప్రజలు హాయిగా ఆస్వాదించవచ్చని తత్త్వ ఆర్ట్స్ నిర్వాహకులు గజేంద్ర షెవాకర్, అఖిలేశ్ వాషికర్  అంటున్నారు. ప్రజల్లో ఉత్సాహంతో పాటు వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని చెబుతున్నారు.