DNA Test: కుక్క యజమాని ఎవరో డీఎన్ఏ పరీక్షతో తేల్చిన మధ్యప్రదేశ్ పోలీసులు

Madhya Pradesh police decides a dog genuine owner by dna test
  • లాబ్రడార్ కుక్కపై యాజమాన్య వివాదం
  • కుక్క నాదంటే నాదని పోలీసులను ఆశ్రయించిన వ్యక్తులు
  • కుక్క తల్లి నుంచి డీఎన్ఏ సేకరణ
  • కుక్క డీఎన్ఏతో పోల్చగా రెండు ఒకటేనని తేలిన వైనం
మధ్యప్రదేశ్ లో ఓ కుక్కకు అసలైన యజమాని ఎవరో తేల్చేందుకు పోలీసులు డీఎన్ఏ పరీక్ష వరకు వెళ్లాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే... ఓ లాబ్రడార్ కుక్క ఎవరిదన్న విషయంలో కార్తీక్ శివహరే, షాదాబ్ ఖాన్ అనే వ్యక్తుల మధ్య వివాదం నెలకొంది. ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు 2020 ఆగస్టులో హోషంగాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు అడిగితే ఎవరికి వారే ఆ కుక్క మాదే అని చెబుతుండడంతో సమస్య ఎటూ తేలలేదు.

ఆ లాబ్రడార్ జాతి శునకాన్ని పచ్ మడీ ప్రాంతంలో కొనుగోలు చేశానని షాదాబ్ చెప్పడంతో పోలీసుల ఆలోచన డీఎన్ఏ పరీక్షలపైకి మళ్లింది. పచ్ మడీలో షాదాబ్ చెప్పిన చిరునామాకు వెళ్లి ఆ కుక్క తల్లి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి, వివాదానికి కారణమైన కుక్క డీఎన్ఏతో సరిపోల్చి చూడగా... రెండూ ఒకటేనని తేలింది. దాంతో షాదాబ్ చెప్పిందే నిజమని నిర్ధారించుకున్న పోలీసులు లాబ్రడార్ కుక్కను అతడికే అప్పగించారు.

ఈ కుక్కల డీఎన్ఏ పరీక్షలు హైదరాబాదులో నిర్వహించారు. అందుకోసం షాదాబ్ కు రూ.50 వేలు ఖర్చయిందట. ఖర్చయితే అయింది గానీ, తన కుక్క తనకు దక్కింది అదే చాలని షాదాబ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
DNA Test
Labrador
Owner
Madhya Pradesh
Police

More Telugu News