Telangana: 3 నెల‌లు వ‌రుస‌గా రేష‌న్ బియ్యం తీసుకోకపోతే రేష‌న్ కార్డు ర‌ద్దు: తెలంగాణ అసెంబ్లీలో మంత్రి గంగుల

  • తెలంగాణ‌లో కోటీ 73 లక్షల మంది లబ్ధిదారులు
  • 80 శాతం మందికి రేషన్‌ కార్డులు ఉన్నాయి
  • మూడేళ్ల‌లో హైద‌రాబాద్‌లో 44,734 కార్డులు ఇచ్చాం
ts minister gives clarity on food security cards

మూడు నెల‌లు వ‌రుస‌గా రేష‌న్ బియ్యం తీసుకోకపోతే  రేష‌న్ కార్డు ర‌ద్దు అవుతుందని తెలంగాణ‌ రాష్ట్ర మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. అసెంబ్లీలో తెల్ల రేషన్‌ కార్డుల గురించి మంత్రి వివ‌ర‌ణ ఇస్తూ... ప్రస్తుతం తెలంగాణ‌లో కోటీ 73 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు.

తెలంగాణలో ఉన్న జనాభాలో 80 శాతం మందికి రేషన్‌ కార్డులు ఉన్నాయని చెప్పారు. తెల్ల రేష‌న్ కార్డుల కోసం కొత్త‌గా 9,41,641 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని వివ‌రించిన ఆయ‌న‌.. వాటిల్లో 3,59,974 మందికి ఆహార భ‌ద్ర‌తా కార్డులు జారీ చేశామ‌ని అన్నారు. 92 వేల ద‌ర‌ఖాస్తులను తిర‌స్క‌రించామ‌ని, 4,88,775 కార్డుల ద‌ర‌ఖాస్తులను ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పారు.  

ఆహార భ‌ద్ర‌తా కార్డుల జారీ నిరంత‌ర ప్ర‌క్రియ అని అన్నారు. త్వ‌ర‌లో కొత్త రేష‌న్ కార్డులు ఇచ్చే అంశం కూడా ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉందని తెలిపారు. మూడేళ్ల‌లో హైద‌రాబాద్‌లో 44,734 కార్డులు ఇచ్చామ‌న్నారు.

అలాగే, న‌గ‌రంలో మ‌రో 97 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. మెదక్‌లో 7 వేలకు పైగా కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని, అలాగే, సిద్ధి పేటలో 10 వేల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చామని తెలిపారు. కరోనా వల్ల గత ఏడాది రేషన్‌ కార్డుల పంపిణీ ఆలస్యం అయ్యిందన్నారు.

More Telugu News