YS Jagan: హైకోర్టుకు వెళ్తామన్న బీపీ ఆచార్య.. జగన్ అక్రమాస్తుల కేసులన్నీ 26కు వాయిదా

YS Jagan illegal assets case adjourned to march 26th
  • నిన్న సీబీఐ కోర్టుకు హాజరైన బీపీ ఆచార్య
  • దాల్మియా సిమెంట్స్ కేసులు ఏప్రిల్ 9కి వాయిదా
  • శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 26కు వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ అక్రమాల కేసులో అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన అభియోగాలను కూడా విచారణలో పరిగణనలోకి తీసుకోవాలంటూ 2016లో సీబీఐ మెమో దాఖలు చేసింది. దీనికి అనుమతినిస్తూ ఈ నెల 10న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో ఈ కేసులో ఏడో నిందితుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య నిన్న హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు తాజా నిర్ణయంపై తాము హైకోర్టుకు వెళ్తున్నామంటూ ఆచార్య తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇందుకు అంగీకరించిన కోర్టు జగన్‌పై నమోదైన కేసుల విచారణను ఈ నెల 26 వరకు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. కోర్టు వాయిదా వేసిన కేసుల్లో ఇండియా సిమెంట్స్ సహా పలు కేసులు ఉన్నాయి.

భారతి సిమెంట్స్ కేసులో నిందితుడైన జెల్లా జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ పై నిన్న వాదనలు కొనసాగాయి. అనంతరం తదుపరి విచారణను ఎల్లుండి (22వ తేదీ)కి వాయిదా వేసింది. అలాగే, పెన్నా సిమెంట్స్, రాంకీ, వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల కేసులన్నీ 22కు వాయిదా పడగా, దాల్మియా సిమెంట్స్‌పై కేసు వచ్చే నెల 9కి వాయిదా పడింది.

అలాగే, ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌ల డిశ్చార్జ్ పిటిషన్‌లపై విచారణ ఈ నెల 30కి వాయిదా పడగా, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం పిటిషన్‌పై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
YS Jagan
Andhra Pradesh
CBI Court
BP Acharya

More Telugu News