UN: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏదో తెలుసా?

  • కొవిడ్‌ ఉన్నా సడలని ఐరోపా దేశాల సంతోషం
  • తొలి పదిస్థానాల్లో తొమ్మిది ఐరోపా దేశాలే
  • తొమ్మిదో స్థానంలో న్యూజిలాండ్‌
  • ఐరోపా ఆధ్వర్యంలో వెలువడ్డ హ్యాపినెస్‌ రిపోర్ట్‌
  • చివరి స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ‌
Do  you Know which is most Happiest country in the world

ఐరోపా దేశాల్ని కరోనా  అతలాకుతలం చేసినప్పటికీ.. అక్కడి ప్రజలు మాత్రం తమ సంతోషాన్ని కోల్పోలేదని ఓ నివేదిక వెల్లడించింది.  ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్‌ మరోసారి తన తొలిస్థానాన్ని పదిలపరుచుకుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏటా వెలువడే ‘దేశాల హ్యాపినెస్‌ రిపోర్టు’ శుక్రవారం విడుదలైంది. ఈ జాబితాలో తొలి పది స్థానాల్లో అత్యధికం ఐరోపా దేశాలే ఉండడం విశేషం. ఫిన్‌లాండ్‌ తన తొలిస్థానాన్ని వరుసగా నాలుగోసారి నిలబెట్టుకుంది.

డెన్మార్క్‌ రెండో స్థానంలో ఉండగా.. స్విట్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, నెదర్లాండ్స్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తొలి పది స్థానాల్లో స్థానం దక్కించుకున్న ఏకైక ఐరోపాయేతర దేశం న్యూజిలాండ్‌ (తొమ్మిదో ర్యాంక్‌) కావడం విశేషం. ఇక యునైటెడ్ కింగ్‌డ‌మ్ ప్రజలు ఈసారి కాస్త ఆందోళనలో ఉన్నట్లు తేలింది. ఆ దేశ స్థానం జాబితాలో 13 నుంచి 17కు పడిపోయింది. అమెరికా ఒకస్థానం కిందకు దిగజారి 19వ స్థానానికి చేరింది.

మరోవైపు జ‌ర్మ‌నీ 17 నుంచి మెరుగుపడి 13కి చేరింది. అలాగే ఫ్రాన్స్ సైతం రెండు స్థానాలు ఎగబాకి 21వ ర్యాంక్‌లో నిలిచింది. 2020లో కరోనాతో అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న దేశాల్లో ఫ్రాన్స్‌ కూడా ఉందన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ అక్కడి ప్రజలు సంతోషంగానే ఉండడం గమనార్హం. మన దేశం విషయానికి వస్తే, ఈ జాబితాలో ఇండియా 139వ స్థానంలో నిలిచింది.

ఇక ఈ జాబితాలో ఆఫ్ఘనిస్థాన్‌ చివరి స్థానంలో నిలవగా.. ఆఫ్రికా దేశాలైన లెసోతో, బోట్సవానా, రువాండా, జింబాబ్వే.. ఆఫ్ఘన్ పైన ఉన్నాయి. మొత్తం 149 దేశాల్లో సర్వే నిర్వహించి ఈ నివేదిక రూపొందించారు. ఇలా ఏటా ‘వ‌ర‌ల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’ విడుద‌ల చేయ‌డం ఇది తొమ్మిదోసారి. ఆయా దేశాల జీడీపీ, సామాజిక మ‌ద్ద‌తు, వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌, అవినీతి వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకొని నివేదిక త‌యారు చేస్తారు. గ‌త మూడేళ్ల‌లో ఆయా అంశాల్లో దేశాల ప‌నితీరును చూసి ర్యాంకులు కేటాయిస్తారు.

More Telugu News