Mehbooba Mufti: జమ్మూకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

  • ఈడీ సమన్లను నిలుపుదల చేయలేమన్న కోర్టు
  • ఈడీ, కేంద్రానికీ నోటీసులిచ్చిన డివిజన్ బెంచ్
  • మార్చి 22న విచారణకు హాజరు కావాల్సిందిగా ముఫ్తీకి ఈడీ సమన్లు
  • నిందితురాలిగా రమ్మంటున్నారా? సాక్షిగానా? చెప్పాలన్న ముఫ్తీ
HC refuses to stay summons issued to Mehbooba Mufti by ED in Money laundering case

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన సమన్లను నిలుపుదల చేయాలని ఆమె వేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఆ ఆదేశాలను నిలుపుదల చేయలేమని చెప్పింది.

ముఫ్తీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించిన చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. ఈడీ, కేంద్ర ప్రభుత్వాలకూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

మార్చి 22న మనీ లాండరింగ్ కేసు విచారణకు హాజరు కావాల్సిందిగా మెహబూబాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే, వాటిని సవాల్ చేస్తూ మెహబూబా డిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు తనను నిందితురాలిగా విచారణకు రమ్ముంటున్నారా? లేక.. సాక్షిగా రమ్మంటున్నారా? అన్న విషయాలను పేర్కొనకుండానే నోటీసులిచ్చారని అందులో పేర్కొన్నారు.

తనను దేని ఆధారంగా విచారణకు రమ్మంటున్నారో చెప్పాలని కోర్టును కోరారు. మనీ లాండరింగ్ నివారణ చట్టం 2002లోని సెక్షన్ 50ని పున:సమీక్షించాల్సిందిగా కోరారు. తనను కేసులో ఇరికించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఏ కేసుకు సంబంధించి సమన్లు ఇచ్చారో ఆ కేసుకు సంబంధించిన పత్రాలను ఇప్పించాలని కోర్టును కోరారు. ఆమెతో పాటు ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు విన్న డివిజన్ బెంచ్.. నోటీసులను నిలుపుదల చేయలేమని చెప్పింది.

More Telugu News