Mukesh Ambani: అంబానీ ఇంటివద్ద బాంబు కారు కేసు: బయటకొస్తున్న షాకింగ్​ విషయాలు

  • హత్యకు గురైన హిరేన్ తో మాజీ పోలీస్ ఆఫీసర్ చర్చలు
  • 10 నిమిషాల పాటు జీపీవో వద్ద చర్చలు
  • సీసీటీవీ ఫుటేజీల పరిశీలనలో వెల్లడి
  • సచిన్ వాజే చుట్టు మరింత గట్టిగా ఉచ్చు
  • మరో రెండు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
Sachin Waze met Mansukh Hiran for 10 minutes on February 17

ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇల్లు యాంటీలియా ముందు.. బాంబులతో కూడిన కారును నిలిపి ఉంచిన కేసులో ముంబై మాజీ పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజే చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన్ను సస్పెండ్ చేయగా.. మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.

గురువారం ఆయన్ను విచారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు.. మరో రెండు విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. టొయొటా ప్రాడో, మెర్సిడిస్ బెంజ్ లను సీజ్ చేశారు. ప్రాడో కారు.. రత్నగిరికి చెందిన శివసేన పార్టీకి చెందిన విజయ్ కుమార్ గణపత్ భోస్లే పేరిట ఉందని అధికారులు గుర్తించారు.

విచారణలో భాగంగా ముంబైలోని సీసీటీవీలను పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులకు విస్తుగొలిపే విషయాలు తెలిశాయి. కేసుకు సంబంధించి హత్యకు గురైన మన్సుఖ్ హిరేన్ ను వాజే పలుమార్లు కలిసినట్టు తేలింది. అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో కూడిన కారును నిలిపి ఉంచిన ఘటనకు ముందు ఫిబ్రవరి 17న ముంబైలోని జీపీవో దగ్గర హిరేన్ తో పది నిమిషాల పాటు సచిన్ వాజే చర్చలు జరిపినట్టు గుర్తించారు.

తన స్కార్పియో కారు పాడవడంతో క్యాబ్ లో హిరేన్ సీఎస్ ఎంటీకి వెళ్లినట్టు గుర్తించారు. అదే సమయంలో ముంబైలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి మెర్సిడిస్ కారులో బయల్దేరిన వాజే.. సీఎస్ ఎంటీ సిగ్నల్స్ దగ్గర ఆగారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ పడినా వాజే కారు మాత్రం ఆగే ఉంది. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే హిరేన్ వచ్చి ఆ కారు ఎక్కినట్టు గుర్తించారు. అక్కడి నుంచి జీపీవోకు వెళ్లిన వారు.. దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడుకున్నట్టు నిర్ధారించారు.

కాగా, ప్రయాణ సమయంలో హిరేన్ కు దాదాపు ఐదు ఫోన్లు వచ్చాయని అతడిని సీఎస్ ఎంటీ దగ్గర దింపిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. ఆ ఐదు ఫోన్లు చేసింది వాజేనేనని అధికారులు భావిస్తున్నారు. ముందుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు ఎదురుగా ఉన్న రూపమ్ షో రూం వద్ద కలవాలని చెప్పినా.. చివరి నిమిషంలో స్పాట్ ను సీఎస్ ఎంటీకి మార్చి ఉండొచ్చని చెబుతున్నారు.

More Telugu News