Punjab: వయసు మీరుతున్నా వివాహం అవడం లేదని.. దోషం పోయేందుకు 13 ఏళ్ల బాలుడిని పెళ్లాడిన టీచర్!

Tuition teacher marries 13 year old student
  • పంజాబ్‌లోని జలంధర్‌లో ఘటన
  • బాలుడిని పెళ్లాడితే దోషం పోతుందన్న జ్యోతిష్యుడు
  • టీచర్ అరెస్ట్
వయసు మీరుతున్నా పెళ్లి కాకపోవడంతో దోషం ఉందని భావించిన ఓ ఉపాధ్యాయురాలు అది పోయేందుకు ఓ బాలుడిని పెళ్లాడింది. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఇక్కడి బస్తీ బావా ఖేల్ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయురాలికి వయసు పైబడుతున్నా వివాహం కావడం లేదు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్లిపోతుండడంతో ఓ జ్యోతిష్యుడిని ఆశ్రయించింది.

పెళ్లి దోషం వెంటాడుతోందని, అది పోవాలంటే తొలుత ఓ బాలుడిని వివాహం చేసుకోవాలని చెప్పాడు. అతడు చెప్పింది నిజమేనని భావించిన ఆ టీచర్.. తన వద్దకు ట్యూషన్ కోసం వచ్చే 13 ఏళ్ల బాలుడిని పెళ్లి కోసం ఎంపిక చేసుకుంది. అనంతరం తన ప్లాన్ ప్రకారం.. బాలుడికి వారం రోజులపాటు ట్యూషన్ చెప్పాల్సి ఉంటుందని, ఆ వారం అతను తమ ఇంట్లోనే వుంటాడనీ బాలుడి తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించింది. తర్వాత టీచర్ కుటుంబ సభ్యులు వీరిద్దరినీ తీసుకెళ్లి పెళ్లి జరిపించారు. ఆ తర్వాత టీచర్ తన గాజులు పగలగొట్టుకుని వితంతువు అయింది.

వారం రోజుల తర్వాత ఇంటికొచ్చిన బాధిత బాలుడు జరిగింది తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీచర్‌ను అరెస్ట్ చేశారు. జ్యోతిష్యుడి సలహా మేరకే అలా చేసినట్టు ఆమె పేర్కొంది. అయితే, ఆ తర్వాత ఇరు కుటుంబాలు రాజీకి రావడంతో బాధిత కుటుంబం కేసును వెనక్కి తీసుకుంది. పోలీసులు ఉన్నతాధికారులు మాత్రం ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Punjab
Jalandhar
Teacher
Marriage
Boy

More Telugu News