Congress: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో బాగా వెనుకపడిపోయిన కాంగ్రెస్!

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓటమి దిశగా కాంగ్రెస్
  • కనీస పోటీ ఇవ్వలేకపోయిన అభ్యర్థులు
  • సాగర్ ఉప ఎన్నికకు ముందు పార్టీలో నైరాశ్యం
Congress Candidates On the way to defeat

నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు ముందు కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పేలా కనిపించడం లేదు. ఖమ్మం, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం దిశగా పయనిస్తోంది. ఖమ్మం నుంచి బరిలోకి దిగిన రాముల్ నాయక్ ఐదో స్థానంలో కొనసాగుతుండగా, హైదరాబాద్ నుంచి పోటీలో ఉన్న ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

నేటి రాత్రి పొద్దుపోయాక గానీ, లేదంటే రేపు ఉదయానికి కానీ తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్‌ ఓటమి దాదాపు ఖాయమైంది. నిజానికి ఈ రెండు స్థానాల్లో గతంలో కాంగ్రెస్ ఎప్పుడూ విజయం సాధించలేదు. అయితే, కరీంనగర్ నుంచి జీవన్‌రెడ్డి గెలవడంతో ఈ రెండు స్థానాలపైనా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే, చివరికి  నిరాశే ఎదురైంది.

కోదండరాం, తీన్మార్ మల్లన్న, చెరుకు సుధాకర్ వంటి వారు మద్దతు కోరినప్పటికీ నిరాకరించిన కాంగ్రెస్ సొంతంగానే ఖమ్మంలో అభ్యర్థిని బరిలోకి దింపింది. తీన్మార్ మల్లన్న గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపునే బరిలోకి దిగారు. ఈసారి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న, కోదండరాం కంటే కాంగ్రెస్ అభ్యర్థి రాముల్ నాయక్‌కు తక్కువ ఓట్లు రావడం గమనార్హం.

More Telugu News