Jalgaon: మహారాష్ట్రలో బీజేపీకి షాక్.. నెల రోజుల్లో రెండోసారి!

  • మెజారిటీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ మేయర్ ఎన్నికల్లో ఓటమి
  • 27 మంది బీజేపీ రెబల్స్ క్రాస్ ఓటింగ్
  • జలగావ్ మేయర్‌గా శివసేన నేత జయ్‌శ్రీ మహాజన్
BJP Loses Jalgaon Mayoral Election After 27 Party Corporators Cross Vote

మహారాష్ట్రలో బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. అత్యధికమంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ రెండు చోట్ల ఆ పార్టీ మేయర్ పదవిని కోల్పోయింది. నిన్న జరిగిన జలగావ్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో శివసేన అభ్యర్థి జయ్‌శ్రీ మహాజన్ విజయం సాధించారు.

ఇక్కడ బీజేపీకి 75 మంది కార్పొరేటర్లు ఉండగా, శివసేనకు ఉన్నది 15 మందే. అయితే, బీజేపీకి చెందిన 27 మంది ప్లేటు పిరాయించి శివసేనకు ఓటు వేశారు. అలాగే, ఎంఐఎంకు చెందిన ముగ్గురు కూడా శివసేనకే ఓటు వేయడంతో ఆ పార్టీకి 45 ఓట్లు పోలయ్యాయి.

బీజేపీ అభ్యర్థి ప్రతిభా కప్సేకు 30 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా జయ్‌శ్రీ మహాజన్ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ పదవి కూడా ఆ పార్టీకే దక్కింది. ఆ పార్టీ అభ్యర్థి కుల్‌భూషణ్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఇక, గత నెలలో జరిగిన సంగి మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీకి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అక్కడ బీజేపీకి అత్యధికంగా 41 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ  మేయర్ పీఠాన్ని ఎన్సీపీకి కోల్పోయింది.

More Telugu News