Chiranjeevi: ఆకట్టుకుంటున్న విరాటపర్వం టీజర్‌.. చిరంజీవి చేతుల మీదుగా విడుదల‌

Virataparvam teaser released by chiranjeevi he expressed happines over it
  • సంతోషం వ్యక్తం చేసిన మెగాస్టార్‌
  • వాస్తవికంగా ఉందని వ్యాఖ్య
  • చిరంజీవి‌ స్పందనకు కృతజ్ఞతలు తెలిపిన రానా
  • ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’ చిత్రం టీజర్‌ను  మెగాస్టార్ చిరంజీవి గురువారం విడుదల చేశారు. టీజర్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు‌. టీజర్‌ను బట్టి చూస్తే సినిమా చాలా వాస్తవికంగా ఉన్నట్లు అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు.

హీరో రానా, హీరోయిన్‌ సాయిపల్లవితో పాటు యావత్‌ చిత్ర బృందానికి, సురేశ్‌ ప్రొడక్షన్స్‌కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. చిరంజీవి స్పందనకు రానా కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్‌ విషెస్‌ తమకు గౌరవంగా భావిస్తున్నామన్నారు.

వేణు ఊడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌లోని సన్నివేశాల్ని బట్టి చూస్తే..  భూస్వాముల ఆకృత్యాలను తన కవిత్వంతో ప్రజానీకానికి తెలియజేస్తుంటాడు రానా. రానా కవిత్వానికి ఫిదా అవుతుంది సాయి పల్లవి. ప్రేమ కోసం అన్నీ వదిలేసి రానా దగ్గరకు బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆమెను చుట్టుముట్టిన సమస్య ఏంటి? రానా కామ్రేడ్‌గా ఎందుకు మారాడు?  వంటి వివరాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కవిత్వం చెప్పిన తీరు, సాయి పల్లవి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. సురేశ్‌ బొబ్బిలి నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Chiranjeevi
Cinema
Tollywood
Virataparvam
Rana Daggubati
Sai Pallavi

More Telugu News